ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నిద్ర అవసరం. నిద్ర కరువైతే.. లేనిపోని రోగాలు రావడం ఖాయం. అయితే, ఎక్కువసేపు పడుకున్నా.. ఆరోగ్యానికి హానికరమేనట. అతిగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్’ హెచ్చరిస్తున్నది. తాజాగా, 21 లక్షల మంది ‘హెల్త్ట్రాక్’ను విశ్లేషించి.. ‘నిద్ర-ఆరోగ్యం’పై పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారిలో మరణాల ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అదే తొమ్మిది, అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో ఈ ప్రమాదం.. 34 శాతం ఉన్నట్లు వెల్లడించింది.
అతిగా నిద్రపోవడం శరీర అంతర్గత ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. నిజానికి.. ఏడు నుంచి తొమ్మిది గంటల నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి హామీ ఇస్తుంది. అంతకుమించితే.. అనారోగ్య సమస్యలు పలకరిస్తాయని ‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్’ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మంచం మీద ఎక్కువ సమయం గడపడం జీవితకాలంపై మాత్రమే ప్రభావం చూపదనీ, మనసుతోపాటు శరీరాన్ని కూడా దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. తొమ్మిది గంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోయే వారిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. అధిక నిద్ర వల్ల నిరాశ, జీవక్రియ సమస్యలు, బరువు పెరగడం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిద్రలేమితోపాటు అతినిద్ర కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అనారోగ్యం, గుండె జబ్బులు, నిరాశ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్లు ఎక్కువగా నిద్రపోతుంటారు. మందుల దుష్ప్రభావం కూడా అతినిద్రకు ఓ కారణమే! చాలామందిలో స్లీప్ అప్నియా, నిద్రలో అంతరాయాల వల్ల.. ఎక్కువసేపు పడకపైనే తిష్టవేస్తారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిద్రను కంట్రోల్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నిద్రా సమయాన్ని ఎప్పటికపుడు ట్రాక్ చేస్తుండాలనీ, ఇందుకోసం హెల్త్ ట్రాకర్లు, స్మార్ట్ వాచీలను ఆశ్రయించొచ్చనీ చెబుతున్నారు.