న్యూఢిల్లీ : ధ్యానంతో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని ప్రాచీన కాలం నుంచి నిపుణులు చెబుతున్న విషయాలను తాజా అధ్యయనం నిర్ధారించింది. నిత్యం మెడిటేషన్ చేసే వారికి ధ్యానాన్ని అభ్యసించని వారితో పోలిస్తే వేగంగా గాఢనిద్ర పడుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. ధ్యానం చేయడం ద్వారా త్వరగా గాఢనిద్ర పడుతుందని, వయసుతో పాటు గాఢనిద్రకు పట్టే సమయం పెరగబోదని పరిశోధనలో వెల్లడైంది.
ధ్యానంతో సరైన నిద్ర, కుదురైన నిద్రకు ఉన్న సంబంధాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) అధ్యయనం గుర్తించింది. విపాసన ధ్యానాన్ని అభ్యసించే వారిలో వయసుతో పాటు నిద్రపట్టేందుకు తీసుకునే సమయం పెరగలేదని పరిశోధకులు కనిపెట్టారు. వీరిలో గాఢనిద్ర సమయం కూడా ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
ధ్యానం ప్రాక్టీస్ చేయని వారిలో గాఢనిద్ర పట్టే సమయం తగ్గుతున్నట్టు గుర్తించారు. నిద్ర లేమిని ధ్యానం ద్వారా అధిగమించవచ్చని ఈ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. న్యూరోమాడ్యులేషన్ టెక్నాలజీ ఎట్ ది నేచురల్ ఇంటర్ఫేస్ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. అత్యంత పురాతనమైన ధ్యాన ప్రక్రియగా పేరొందిన విపాసనను నిత్యం అభ్యసిస్తే ఏకాగ్రత పెరగడంతో పాటు సుఖనిద్ర, కుంగుబాటు, ఆందోళనను అధిగమించేందుకు ఉపకరిస్తుంది.