గుండెపోటు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు 60 ఏండ్లు దాటిన వారిలోనే హృదయ సంబంధిత సమస్యల గురించి వినేవాళ్లం. కానీ కరోనా తరువాత యుక్త వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు, గుండెపోటు మరణాలనుచూస్తున్నాం. కారణాలేమైనా ఈ గుండెపోటు సమస్య అప్పటికప్పుడు రాదంటున్నారు వైద్యులు. తాను అలసిపోతున్న సంకేతాలను శరీరం ద్వారా మనకు 12 సంవత్సరాల ముందు నుంచే హెచ్చరిస్తుందని చెబుతున్నారు. పుష్కర కాలం కన్నా ముందు నుంచే శరీరం మనకిచ్చే సంకేతాలు ఏంటి? వాటిని గుర్తించడం ఎలా? గుండెపోటు రిస్క్‌ను ముందుగానే పసిగట్టడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? ముందస్తు చికిత్సా పద్ధతులు ఏమున్నాయి? తదితర విషయాలు ఇవాళ్టి ‘ఊపిరి’లో తెలుసుకుందాం..
Heart Attack | శారీరక శ్రమ అనేది గుండెకు రక్షణ కల్పిస్తుంది. గతంలో మన పూర్వికులు నిరంతరం శారీరక శ్రమపైనే ఆధారపడి జీవించేవారు. అందుకే అప్పట్లో గుండెపోటు లాంటి సమస్యలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా అది 60, 70 ఏండ్లు దాటిన వారిలో మాత్రమే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది హృద్రోగాలకు గురవుతున్నారు. అందుకు మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణం అని చెప్పాలి.
గతంలో రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు. అందువల్ల మన పెద్దలు పొరుగు ఊళ్లకు కూడా కాలినడకన వెళ్లేవాళ్లు. సైకిళ్ల మీద పదుల కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఆడవాళ్లయితే దుస్తులు ఉతకడం, నీళ్లు చేదడం, పిండి రుబ్బడం లాంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు. దీనివల్ల వాళ్లు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను శారీరక శ్రమ చేసేవారు. సమయానికి భోజనం తినేవారు. త్వరగా పడుకుని కంటినిండా నిద్ర పోయేవారు. తెల్లవారుజామునే లేచి పనుల్లో మునిగిపోయేవారు. మానసిక ఒత్తిళ్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా.. ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు అండగా నిలిచేవారు. దీంతో మానసిక సంఘర్షణ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థి దశ నుంచే మానసికంగా, శారీరకంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగరీత్యా ఉరుకులు, పరుగుల జీవనం గడపాల్సి వస్తున్నది. ఇవన్నీ మనిషి గుండెను బలహీనపరుస్తున్నాయి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలామంది పాటించడం లేదు. జంక్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారు. ఉద్యోగరీత్యా తీరిక లేక కొందరు, మారిన జీవన విధానానికి అలవాటుపడి మరికొందరు ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఔట్‌సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు. దీని వల్ల చెడు కొవ్వు పెరిగి ఊబకాయం బారినపడుతున్నారు. అంతేకాదు ఆహారంలోని హానికారక రసాయనాలు, కలుషిత పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. ఊబకాయంతో మధుమేహం పలకరిస్తున్నది. ఈ రెండూ గుండెను బలహీనపరుస్తున్నాయి.
సాధారణంగా గుండెపోటు సంబంధిత సమస్యలు హఠాత్తుగా రావు. గుండెపోటుకు 12 సంవత్సరాల ముందే మన గుండె కొన్ని రకాల హెచ్చరికలు పంపుతుంది. ముఖ్యంగా చురుకుగా నడవలేకపోవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి గతంలో లాగా చేయలేకపోవడం. ఉదాహరణకు 10 ఏండ్ల కిందట ఒక వ్యక్తి గంటలో 5 కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవగలిగి, పదేండ్ల తర్వాత అదే గంటలో 3 కిలోమీటర్లు నడవడానికే ఆపసోపాలు పడితే.. గుండె బలహీనం అవుతున్నట్టే అని గుర్తించాలి. వయసు పెరగడం వల్ల.. శరీరంలో సత్తువ తగ్గిందని చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అదే వాళ్ల కొంప ముంచుతుంది.
శాస్త్రీయంగా 18 నుంచి 60 ఏండ్ల వయసు వారు గంటకు 5 కిలోమీటర్లు చురుకుగా నడవగలగాలి. అలా నడవలేకపోతే వారిలో అనారోగ్య సమస్యలు దాగి ఉన్నట్లు అనుమానించాల్సిందే! అంటే ఒక వ్యక్తి 30 ఏండ్ల వయసులో గంటకు 5 కిలోమీటర్లు చురుకుగా నడిచినప్పుడు, 35 ఏండ్లప్పుడూ గంటలో 5 కిలోమీటర్లు నడవగలగాలి. అలా నడవలేకపోతే.. గుండె బలహీనపడుతున్నదని అనుమానించి, తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది.
కొందరిలో వయసురీత్యా మోకాళ్ల నొప్పులతో పాటు ఊబకాయం లాంటి సమస్యల కారణంగా ఎవరైనా గతంలో లాగా చురుకుగా నడక లేదా ఇతర వ్యాయామం చేయలేకపోతే వారికి గుండెపోటు సంకేతాలు ఉన్నట్లు అనుమానించలేం. కానీ, వారికి మోకాళ్ల నొప్పులు, ఊబకాయం లాంటి వాటికి చికిత్స ఇచ్చిన తరువాత కూడా చురుకైన నడక లేదా వ్యాయామం చేయలేకపోతే మాత్రం అనుమానించాల్సిందే. అయితే గుండెపోటుకు 12 సంవత్సరాల ముందు నుంచే శరీరంలో సత్తువ తగ్గి, చురుకైన నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చేయలేకపోతుంటారు. అంటే వ్యాయామం చేసేటప్పుడు, నడక సమయంలో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని నిశితంగా గమనించి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
శారీరక శ్రమ చేయక పోవడంతో ఊబకాయం, మధుమేహం రిస్క్ పెరుగుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు కచ్చితంగా శారీరక శ్రమ చేయాలి. గంటకు ఐదు కిలోమీటర్లు నడవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నట్టే అని భావించాలి. వైద్యులను సంప్రదించాలి. 18 నుంచి 60ఏండ్ల వయసు వారికి ఈ నియమం వర్తిస్తుంది. బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్, జిమ్ వంటివి వారంలో రెండుసార్లు 60 నుంచి 90 నిమిషాలు వరకు చేయాలి. వీటితోపాటు యోగాసనాలు రెగ్యులర్‌గా వేస్తూ ఉంటే మీ గుండె పదిలంగా ఉంటుంది.
ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం స్మోకింగ్‌తో సమానం. అంటే ధూమపానం వల్ల గుండెకు ఎంత హాని కలుగుతుందో, ఒకేచోట ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా అంతే ముప్పు కలుగుతుంది. డెస్క్ జాబ్‌ల వల్ల గంటల తరబడి కూర్చొని పనిచేయాల్సి వస్తున్నది. అయితే ఉద్యోగంలో అలా పనిచేయక తప్పని పరిస్థితి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను నివారించవచ్చు. గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ తిరగడం లాంటివి చేయాలి. దీనివల్ల సమస్యను కొంతవరకు నివారించవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ సుధీర్ కుమార్
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్