Stress Relieving Foods | నిత్యం చాలా మంది ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా చాలా మందికి అనేక కారణాల వల్ల ఒత్తిడి ఉంటోంది. దీన్నుంచి బయట పడే మార్గం కూడా చాలా మందికి తెలియడం లేదు. అయితే ఒత్తిడి విపరీతంగా ఉన్నప్పుడు పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల దీని నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తింటే మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ఇవి మూడ్‌ను మారుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత పొందవచ్చు. మైండ్ రిలాక్స్ అయి నిద్ర కూడా చక్కగా పడుతుంది. ఇక ఒత్తిడిని తగ్గించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు ఆకుకూరలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆకుకూరలను తింటే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. పాలకూరలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. మన శరీరంలో తగినంతగా మెగ్నిషియం లేకపోతే ఆందోళన, కంగారు, ఒత్తిడి వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. తరచూ పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఒత్తిడి నుంచి బయట పడేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
బ్రౌన్ రైస్, క్వినోవా, ఇతర తృణ ధాన్యాల్లో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే మూడ్‌ను మార్చడంలో సహాయ పడతాయి. దీంతో కోపం, విసుగు, ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. అలాగే తాజా పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మెగ్నిషియం అధికంగా ఉండే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలను తినాల్సి ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
అవకాడోలను చాలా మంది చూసే ఉంటారు. ఇవి పండ్ల జాతికి చెందినవి. మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తుంటాయి. అవకాడోలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఫైబర్, పలు రకాల బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. సాల్మన్, సార్డైన్స్, మాకరెల్, ట్యూనా వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. వాపులను తగ్గిస్తాయి. మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి నుంచి బయట పడేలా చేస్తాయి. కనుక ఈ ఆహారాలను తరచూ తింటుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు.