Sleep | ఒత్తిడి.. పెద్దల్నే కాదు, పిల్లల్నీ చిత్తు చేస్తున్నది. విద్యాపరమైన టార్గెట్లలో బాల్యం బందీ అవుతున్నది. ఇక డిజిటల్ గ్యాడ్జెట్ల వాడకం.. పిల్లల నిద్రా నాణ్యతను దెబ్బతీస్తున్నది. వాటిల్లోంచి వచ్చే బ్లూలైట్ వల్ల.. నిద్రను నియంత్రించే మెలటోనిన్ సహజ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతున్నది. మొత్తంగా.. నేటితరం చిన్నారులకు కంటినిండా నిద్ర కరువైపోతున్నది. జీవనశైలిలో మార్పుల వల్ల ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉన్నది.
కొంతమంది పిల్లలు.. ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. కొందరికి అస్సలు నిద్రపట్టదు. అలాంటి వారిని నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. జీవనశైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అయితే, చిన్నారుల ఎదుగుదలలో ఆహారం తర్వాత నిద్రే కీలకమైంది. మెదడు వికాసానికీ నిద్ర దోహదం చేస్తుంది. కాబట్టి, పిల్లలకు కంటినిండా నిద్ర ఎంతో అవసరం. ఇందుకోసం పిల్లలకు ప్రత్యేక దినచర్యను అలవాటు చేయాలని చెబుతున్నారు నిపుణులు. కథల పుస్తకాలు చదవడం, చిన్నచిన్న వ్యాయామాలు, మృదువైన సంగీతం వినడం వంటివి పిల్లల మనసును ప్రశాంతపరుస్తాయి.
ఇక స్క్రీన్ టైమ్ను తగ్గించడం, పడుకునే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయడం.. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి నిద్రలేచే అలవాటు.. నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక పిల్లల్లో నిద్రను ప్రోత్సహించడానికి.. బెడ్రూమ్ చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. మంచం సౌకర్యవంతంగా ఉండాలి. మనసుకు ప్రశాంతత చేకూర్చే పుస్తకాలు కూడా మంచి నిద్రకు ఆహ్వానం పలుకుతాయి. రాత్రి పడుకునే ముందు శరీరాన్ని సున్నితంగా స్ట్రెచ్ చేయడం, యోగా లాంటివీ.. నిద్రకు సహకరిస్తాయి. అయితే, ఇలాంటి దినచర్యలను పాటించడం కేవలం స్వల్పకాలిక పరిష్కారం కోసమే కాదు.
ఇది పిల్లల్లో భావోద్వేగ పరంగా, మానసికంగా సానుకూల మార్పు తీసుకొస్తుంది. స్థిరమైన, ప్రశాంతమైన దినచర్య.. పిల్లలకు స్వీయ నియంత్రణపై నైపుణ్యాన్ని నేర్పుతుంది. దీర్ఘకాలంలో పిల్లలు ఒత్తిడిని నిర్వహించడానికి సన్నద్ధమవుతారు. మెరుగైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. మంచినిద్ర వేసే ఈ పునాది.. పిల్లల తరువాతి జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పలు సర్వేలూ చెబుతున్నాయి.