మా పాప వయసు తొమ్మిది నెలలు. మూడు నెలల నుంచి విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. డాక్టర్లకు చూపించాం. వాళ్లు రాసిన సిరప్లు వాడినప్పుడు విరేచనాలు తగ్గిపోతున్నాయి. వారానికే మళ్లీ మొదలవుతున్నాయి. ఇలా తరచుగా విరేచనాలు కావడం బిడ్డ పెరుగుదలకు ప్రమాదకరమా? అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
పిల్లల వయసు ఆరు నెలలకు రాగానే ఎక్కువసార్లు విరేచనాలు కావడం సాధారణమే. ఇలా తరచుగా జరుగుతుంది. దీన్ని డయేరియాగా పరిగణించలేం. విరేచనం నీళ్లలా కాకుండా ఘనపదార్థంలా ఉండి, రోజుకు నాలుగు లేదా అయిదు సార్లు అయితే భయపడాల్సిందేమీ లేదు. అది డయేరియా కాదు. ఆరు నెలలు దాటిన పిల్లల్లో విరేచనం పెరగడం ఎందుకు జరుగుతుందంటే… ఆరు నెలల వయసు నుంచి ఘన రూప ఆహారం ఇవ్వడం మొదలుపెడతారు. దానికి పేగులు అలవాటయ్యే క్రమంలో విరేచనాలు పెరుగుతాయి. ఆరు నెలల వయసు నుంచి దంతాలు వస్తాయి. ఆ సందర్భంలో చిగుళ్లలో దురద పుడుతుంది. అప్పుడు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు. అందువల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దాంతో విరేచనాలు పెరగవచ్చు. ముఖ్యమైన మరో కారణం డబ్బా పాలు. పాల బాటిల్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్కు ఆస్కారం ఉంది.
మీరు చెప్పిన వివరాల్లో పాపకు రోజుకు ఎన్నిసార్లు విరేచనం అవుతున్నదో చెప్పలేదు. నీళ్ల విరేచనాలు అవుతున్నాయా? గట్టి విరేచనాలు అవుతున్నాయా? వివరంగా చెప్పలేదు. ఆ సందర్భంలో పాప బరువు పెరుగుతున్నదా? తగ్గుతున్నదా కూడా చెప్పలేదు. ఒకవేళ రోజుకు మూడు, నాలుగు సార్లు విరేచనం అవుతున్నా పాప బరువు తగ్గకుండా ఉంటే అది డయేరియా కాదు. అలా కాకుండా చాలాసార్లు నీళ్లు నీళ్లుగా విరేచనం అయినా, విరేచనంలో రక్తం పడినా, పదేపదే అయ్యే విరేచనాల వల్ల పాప బరువు తగ్గుతున్నా వెంటనే పిల్లల డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల బరువు, మల పరీక్ష చేసి, సమస్యను నిర్ధారించాలి. పొట్టకు సాంత్వన చేకూర్చే, పేగుల్ని బలోపేతం చేసే జింక్ డ్రాప్స్, మంచి బ్యాక్టీరియా (ప్రోబయాటిక్స్ ) ఇస్తారు. వాడండి. యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.
నీళ్ల విరేచనాల బారిన పడకుండా బిడ్డల కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్