Smart Phones To Kids | కేవలం వినోదం కోసమే కాకుండా చదువుల కోసం కూడా డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడం చాలా కుటుంబాల్లో సాధారణమైంది. అయితే ఫోన్ కొనివ్వడం కంటే, దాన్ని ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలో నేర్పించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక స్క్రీన్ టైమ్ అలవాటుగా మారితే అది పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లల మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటుంది. ముఖ్యంగా ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం వంటి సామర్థ్యాలు ఈ దశలోనే రూపుదిద్దుకుంటాయి. ఎక్కువసేపు మొబైల్, ట్యాబ్ లేదా ఇతర స్క్రీన్ల ముందు గడపడం వల్ల మెదడుపై అధిక ఉత్తేజం ఏర్పడి, ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం, వాస్తవ జీవితంలోని కార్యకలాపాలపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా షార్ట్ వీడియోలు, వేగవంతమైన గేమ్స్ వంటి కంటెంట్ పిల్లలను నిరంతరం ఆకర్షిస్తుంటాయి. దీంతో నిజ జీవితంలో నెమ్మదిగా జరిగే ఆటలు, పుస్తకాలు చదవడం, స్నేహితులతో గడపడం వంటి కార్యకలాపాలపై ఆసక్తి తగ్గిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిరాకు, అసహనం, ఏకాగ్రత లోపం, మూడ్ స్వింగ్స్, బయట ఆడుకోవాలనే ఆసక్తి తగ్గడం వంటి మార్పులను గమనిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్లకు అలవాటు పడిన పిల్లల్లో తక్షణ సంతృప్తి కోరుకునే స్వభావం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. గేమ్‌లలో వచ్చే రివార్డులు, నిరంతరం అందుబాటులో ఉండే కొత్త వీడియోలు లేదా కంటెంట్ కారణంగా పిల్లలు ఎప్పటికప్పుడు ఫోన్‌ను ఉపయోగించాలని భావిస్తారు. ఫోన్‌ను తీసేస్తే కొందరిలో కోపం, ఏడుపు, అసహనం లేదా ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయని వారు పేర్కొంటున్నారు. అధిక స్క్రీన్ టైమ్ ప్రభావం ముందుగా నిద్రపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ వాడితే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. పిల్లల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ, మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అయితే పిల్లలను పూర్తిగా సాంకేతిక పరికరాలకు దూరంగా ఉంచడం ఆచరణలో సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికతను పూర్తిగా నిషేధించడం కంటే, సమతుల్యంగా ఉపయోగించే అలవాటు పెంపొందించడం ముఖ్యమని సూచిస్తున్నారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగిస్తే అది హానికరం కాదని, పిల్లల్లో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లు పెంపొందించడం అవసరమని చెబుతున్నారు. దీని కోసం ప్రతిరోజూ నిర్దిష్ట స్క్రీన్ టైమ్‌ను నిర్ణయించడం, బయట ఆటలు, క్రీడలు, శారీరక వ్యాయామాలను ప్రోత్సహించడం, పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం, సంగీతం వంటి హాబీలను అలవాటు చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే సమయంలో, నిద్రకు ముందు స్క్రీన్లను పూర్తిగా దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులే మొబైల్ వినియోగంలో ఆదర్శంగా ఉండి, పిల్లలతో కలిసి సమయం గడపడం ద్వారా ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లు పెంపొందించవచ్చని వారు పేర్కొంటున్నారు.