Diabetes | మధుమేహం ఉన్నవారు పండ్లలో సహజ చక్కెర ఉంటుందని వాటిని తినడానికి భయపడుతుంటారు. అయితే పండ్లలో కార్బొహైడ్రేట్లతోపాటు శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పదార్థం కూడా ఉంటాయి. ముఖ్యంగా పండ్లను రసం రూపంలో కాకుండా పూర్తిగా తినడం వల్ల అందులోని పీచు చక్కెర రక్తంలోకి వేగంగా చేరకుండా జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం తగ్గుతుంది. అయితే అన్ని పండ్ల ప్రభావం ఒకేలా ఉండదు. మధుమేహం ఉన్నవారు పండ్ల రకం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారికి జామపండు మంచి ఎంపికగా పేర్కొంటున్నారు. ఇందులో పీచు అధికంగా ఉండడంతోపాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, కరిగే పీచు అధికంగా ఉండి చక్కెర తక్కువగా ఉంటుంది. పియర్‌లో పీచు ఎక్కువగా ఉండడంతో రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల కావడానికి సహాయపడుతుంది. యాపిల్‌ను తొక్కతో తినడం వల్ల పీచు, ఇతర పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. నారింజలో పీచు, విటమిన్ సి, పొటాషియం ఉంటాయి. అయితే నారింజ రసాన్ని తీసుకోవడం కంటే పండును పూర్తిగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కివిలో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, పీచు ఉంటాయి. పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, సహజ ఎంజైములు ఉంటాయి. అయితే సహజ చక్కెరలు ఉండడంతో పరిమాణంపై నియంత్రణ అవసరం. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, ఇనుము ఉన్నప్పటికీ ఇతర కొన్ని పండ్లతో పోలిస్తే సహజ చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవాలి. మామిడిపండులో సహజ చక్కెర, గ్లైసెమిక్ సూచీ ఎక్కువగా ఉండడంతో చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ద్రాక్షను కూడా సులభంగా ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్నవారు పరిమాణాన్ని నియంత్రించాలి.
మధుమేహం ఉన్నవారు పండ్ల రసాలు లేదా ఎండబెట్టిన పండ్లకు బదులుగా తాజా పండ్లను పూర్తిగా తినడం మంచిది. ఒకేసారి ఎక్కువ పండ్లు తినకుండా చిన్న పరిమాణాల్లో తీసుకోవాలి. పండ్లను గింజలు, పెరుగు వంటి ప్రొటీన్ ఉన్న ఆహారంతో లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతాయి. బెర్రీలు, చెర్రీలు, యాపిల్ వంటి తక్కువ గ్లైసెమిక్ సూచీ కలిగిన పండ్లను ఎంచుకోవచ్చు. యాపిల్, పియర్ వంటి పండ్లను వీలైనంత వరకు తొక్కతో తినడం ద్వారా అదనపు పీచు లభిస్తుంది. ఏ పండు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, సరైన పరిమాణంలో, జాగ్రత్తగా ఎంచుకుని తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.