చర్మం, ఎముకలు, ఇతర కణజాలాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచే ప్రొటీన్ కొలాజెన్. ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది. కానీ, మాంసాహారం దీని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి, మాంసం, ఎముకల పులుసు తింటేనే శరీరంలో కొలాజెన్ స్థాయులు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. శాకాహారం నుంచి కూడా శరీరంలో కొలాజెన్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలు లభిస్తాయని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
Collagen | మొక్కల నుంచి వచ్చే ఆహారం నుంచి కూడా శరీరంలో కొలాజెన్ స్థాయులు మెరుగుపడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇక కొలాజెన్ మాంసాహారంలోనే ఉంటుందనేది అపోహ మాత్రమే. దీనిని పప్పుధాన్యాలు, బాదం, జీడిపప్పు లాంటి ఎండుఫలాలు, గింజలు లాంటి మొక్కల నుంచి వచ్చే పదార్థాల నుంచి కూడా పొందవచ్చు. పైగా జంతు ఆహారం కంటే కొలాజెన్ ఉత్పత్తికి మొక్కల నుంచి వచ్చే ఆహారమే మంచిదనేది పోషకాహార నిపుణుల మాట.
జంతుమాంసం (రెడ్ మీట్)లో ఉండే అడ్వాన్స్డ్ ైగ్లెకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (ఏజీఈస్) కొలాజెన్ను ధ్వంసం చేస్తాయట. అదే మొక్కల ఆధారిత ఆహారాలు యాంటి ఆక్సిడెంట్లతో సమృద్ధంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలాజెన్ క్షీణించకుండా చూడటమే కాకుండా, ఆరోగ్యకరమైన కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కొలాజెన్ ఉత్పత్తికి అవసరమైన మరో పోషకపదార్థం విటమిన్ సి. ఇది కొలాజెన్ శరీర కణాల్లో కలిసిపోవడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సిట్రస్ జాతి పండ్లు, క్యాప్సికం, ఆకుకూరలు విటమిన్ సి గనులు. కొలాజెన్ ఉత్పత్తి కోసం శాకాహారులు, వీగన్లకు ఈ తరహా ఆహారం మేలుచేస్తుంది.
ఆహారంతోపాటు జీవనశైలి మార్పులు కూడా కొలాజెన్ ఉత్పత్తిలో ప్రభావం చూపుతాయి. ధూమపానం, ఎండలో గడపడం, అధిక చక్కెరలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఒత్తిడి స్థాయులు కూడా శరీరంలో కొలాజెన్ క్షీణతకు కారణమవుతాయి. మరోవైపు, బరువును తట్టుకునే వ్యాయామాలు కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. చర్మం, ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.