Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. దీన్ని నియంత్రించకపోతే భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో ఆందోళనకరంగా డయాబెటిస్ రోగులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) ఇటీవల నివేదికలో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం భారత్‌లో 89.8 మిలియన్ల (8.94కోట్లు) మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది 2050 నాటికి భారత్‌లో డయాబెటిస్ కేసులు 73శాతం పెరిగి 156 మిలియన్లు (15.6కోట్లు) చేరుకుంటుందని నివేదిక బయటపెట్టింది.
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 20-79 సంవత్సరాల మధ్య వయసు గల 589 మంది మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారని అంచనా. ప్రపంచ జనాభాలో 11.1శాతం మంది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 853 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. మధుమేహంతో జీవిస్తున్న నలుగురిలో ఒకరు (158 మిలియన్లు) 65 సంవత్సరాలు వ్యక్తులే. 20-79 సంవత్సరాల వయసు గల 365 మిలియన్ల మంది గ్లూకోజ్ టాలరెన్స్‌తో జీవిస్తున్నారని అంచనా. 2024లో మధుమేహంతో బాధపడుతున్న వారంతా చికిత్స కోసం ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య వ్యయంలో 12శాతంగా ఉన్నది. ఇదే సంవత్సరంలో డయాబెటిస్ కారణంగా 3.4 మిలియన్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అన్ని కారణాలతో ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే 9.3శాతంగా ఉన్నది. అప్పుడే పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు (23 మిలియన్లు) ఏదో ఒక రకమైన హైపర్‌గ్లైసీమియాతో బాధపడుతున్నట్లు అంచనా.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.15 మిలియన్ల మంది వ్యక్తులు టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇందులో 22.3శాతం అంటే 2.04 మిలియన్ల మంది తక్కువ ఆదాయం, మధ్య ఆదాయ దేశాల్లో నివస్తున్నారు. ఈ మొత్తం 9.15 మిలియన్ జనాభాలో 1.81 మిలియన్లు (19.8శాతం) 20 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు ఉన్నారు. 6.28 మిలియన్లు (68.6శాతం 20-59 సంవత్సరాల మధ్య వయసుగల వారు, 1.06 మిలియన్లు 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు ఉన్నారు. జీవనశైలిలో మార్పులు, సరిగా ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కేవలం వృద్ధుల సమస్య కాదని.. పిల్లల నుంచి ప్రతీ ఒక్కరూ డయాబెటిస్‌కు బాధితులుగా మారుతున్నట్లుగా నివేదిక పేర్కొంది.