మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్లు కూడా విస్మరించదగనివే. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించేందుకు ప్రత్యేకమైన ఆహార విధానాన్ని అనుసరించాలి.
నీళ్లు తగినన్ని…
తగినన్ని నీళ్లు తాగితే మూత్రంలో లవణాలు పలుచబడతాయి. అలా రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గిపోతుంది. రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలి.
ప్రొటీన్ల శక్తి
నీళ్లు తగినన్ని తాగడంతోపాటు ప్రొటీన్లు కూడా అవసరమైనన్ని తీసుకోవాలి. అయితే, ప్రొటీన్లు మోతాదు మించితే కూడా కిడ్నీలో రాళ్ల ముప్పు పెరుగుతుంది. మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లు ఎక్కువగా, జంతు ఆధారితమైనవి తక్కువగా తీసుకోవాలి.
ఉప్పు తక్కువగా
సోడియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తింటే శరీరంలో కాల్షియం స్థాయులు పెరుగుతాయి. అలా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా పెరుగుతుంది. ఉప్పు రోజుకు 2,300 మిల్లీగ్రాముల మోతాదు మించకుండా చూసుకోవాలి. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఆహారం తీసుకుంటున్నప్పుడు వాటిలో సోడియం తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోవాలి.
కాల్షియం తప్పనిసరి
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు, కాల్షియం ఉన్న ఆహార పదార్థాల నుంచి రోజుకు 1,000 నుంచి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందివ్వాలి. కాకపోతే, కాల్షియం తక్కువైనా, ఎక్కువైనా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. కాబట్టి, కాల్షియం సప్లిమెంట్లు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలి.
ఆగ్జలేట్ ఎక్కువ వద్దు
పాలకూర, రుబార్బ్, బీట్ దుంపలు, గింజలు, చాక్లెట్ లాంటి ఆగ్జలేట్ ఉన్న ఆహార పదార్థాలను మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. నారింజ, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష మొదలైన వాటిలో సిట్రేట్ ఉంటుంది. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తాయి.