Mouth Bacteria | సాధారణంగా మనం నోటిలో ఉండే బ్యాక్టీరియా వలన నోటి సమస్యలు, దంత సమస్యలు తలెత్తుతాయని భావిస్తాం. కానీ నోటిలో ఉండే బ్యాక్టీరియా పొట్ట ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనంలో తేలింది. ప్రతి సంవత్సరం దాదాపు రెండు మిలియన్లకు పైగా ప్రజలు అడ్వాన్స్డ్ క్రానిక్ లివర్ డిసీజ్ తో మరణిస్తున్నారు. 86 మంది రోగుల నుండి లాలాజలం, మలం నమూనాలలో బ్యాక్టీరియా సంఖ్యను విశ్లేషించారు. కాలేయ వ్యాధి తీవ్రతరం కావడంలో జీర్ణాశయంలో మైక్రోబయోమ్ రెండు గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ బృందం కనుగొన్నారు.
మన శరీరంలో ఒక శరీర భాగంలో బ్యాక్టీరియా ఒక్కో రకంగా ఉంటుంది. కానీ కాలేయ వ్యాధి ఉన్న రోగుల్లో వ్యాధి పెరిగే కొద్ది నోటి, పొట్టలో ఉండే బ్యాక్టీరియా మరింత సారూప్యంగా మారుతుంది. నోరు, పొట్టలో ఒకేలాంటి బ్యాక్టీరియా జాతులు కనుగొనబడ్డాయి. ఈ జాతులు సాధారణంగా నోటిలో కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రేగుల్లో చాలా అరుదుగా ఉంటాయి. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న రోగుల్లో ఈ నోటి బ్యాక్టీరియా సంపూర్ణ సమృద్దిలో పెరుగుదలను పరిశోధకులు కనుగొన్నారు. నోటిలో ఉండే ఈ బ్యాక్టీరియా నోటి నుండి స్థానాంతరం చెంది ప్రేగులలో స్థిరపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగి ప్రేగుల్లో నోటిలో ఉండే అనేక బ్యాక్టీరియా జాతులను కూడా వారు కనుగొన్నారు. అలాగే మలం నమూనాలో ఉండే ఈ బ్యాక్టీరియా పేగు ఆరోగ్యానికి కూడా నష్టాన్ని కలిగిస్తుందని వారు వెల్లడించారు.
ఈ బ్యాక్టీరియా కొల్లాజెన్ డిగ్రేడేషన్ ఎంజైమ్ లను ఎన్కోడ్ చేసే జన్యువులను కలిగి ఉంటుందని జన్యు విశ్లేషణలో తేలింది. కొల్లాజెన్ విచ్ఛిన్నం పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది బ్యాక్టీరియా, బ్యాక్టీరియా ఉత్పత్తులు కాలేయం వంటి ఇతర అవయవాలను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి పరిశోధనలు చేయడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడే వారికి కొత్త చికిత్స వ్యూహాలను కనుగొనవచ్చని, పొట్ట ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నోటి బ్యాక్టీరియా జీర్ వ్యవస్థ ఆరోగ్యాన్నిగణనీయంగా ప్రభావితం చేస్తుందని, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.