Meal Subscription | రుచిగా ఉండాలి. రెస్టారెంట్ అనుభూతిని ఇవ్వాలి.క్యాలరీల లెక్క తప్పకూడదు. కార్బొహైడ్రేట్స్ లక్ష్మణరేఖ దాటకూడదు. పొట్ట కాల్చుకునే పరిస్థితే ఉండకూడదు. కానీ, బరువు తగ్గాలి. కొవ్వు వదిలించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. బడ్జెట్ కొంత ఎక్కువైనా ఫర్వాలేదు. ..ఇవేం గొంతెమ్మ కోరికలు కాదు. నవతరం డిమాండ్స్! ‘ప్రామిస్.. ఏ ఒక్కటీ మిస్ కాకుండా మీకు ముప్పూటలా ఆహారం పంపే బాధ్యత మాది’ అంటున్నాయి ‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’ కంపెనీలు. అప్పుడే, కాలింగ్ బెల్ మోగిందా? డెలివరీ బాయ్ కావచ్చు. వెళ్లండి. తలుపు తీయండి. పార్సిల్ అందుకోండి. పొట్ట నింపుకోండి.
1 ఈ రోజు ఏం వండాలి? రేపు ఏం వండాలి? ఎల్లుండి? ఆవల ఎల్లుండి? ఇల్లాలికి నిద్రపట్టనివ్వని ప్రశ్నలు. రాత్రంతా అవే ఆలోచనలు. దిగ్గున లేచి ఫ్రిజ్ తెరుస్తారు. ఫ్రిజ్‌లోని కాయగూరల్ని తడిమి చూసుకుంటారు. ఆకుకూరలు ఏ మాత్రం తాజాగా ఉన్నాయన్నది తెలుసుకుంటారు. అంతలోనే భర్త ఇష్టాలు, పిల్లల అయిష్టాలు గుర్తుకొస్తాయి. ఆయనకు వంకాయ పడదు. పెద్దోడికి బెండకాయ సహించదు. చిన్నదానికి ఆలూ ఉండాల్సిందే. అత్తామామలకు ఆర్గానిక్. ఐదుగురిలో ఇద్దరికి మిల్లెట్ రైస్. ఎవరి డైట్ చార్ట్ వారిది. ఎవరి పోషక అవసరాలు వారివి. ఆమె కనుక ఉద్యోగిని అయితే.. ఇంట్లో యుద్ధమే. ఆ తల్లికి సాయంచేసేవారే లేరా?
2. ఈ రోజు ఏం తినాలి? రేపు ఏం తినాలి? ఎల్లుండి? ఆవల ఎల్లుండి? బ్రహ్మచారులకు నిద్రపట్టనివ్వని ప్రశ్నలు. మునుపట్లా.. దగ్గర్లోని టిఫిన్ సెంటర్‌కు వెళ్లి వరుసబెట్టి ఇడ్లీ, వడ, పూరి, దోసె.. లాగించే పరిస్థితులు లేవు. ఏ క్యాంటీన్ నుంచో భోజనం తెప్పించుకుని సుష్టుగా ఆరగించేంత అదృష్టమూ లేదు. పక్కా డైటింగ్ మరి. కొలెస్ట్రాల్‌తో యుద్ధం చేయాల్సిందే. ఎలా? మరెలా?
3. కార్పొరేట్ కంపెనీల కష్టాలు కార్పొరేట్ కంపెనీలవి. క్యాంటీన్లో సకల రుచులూ వడ్డిస్తున్నా.. సిబ్బందిలో ఏదో అసంతృప్తి. ఒకరికి బీపీ, ఒకరికి షుగర్, ఒకరికి ఊబకాయం. పిజ్జాబర్గర్ల వైపు చూసేవారే లేదు. స్వీట్స్ ముట్టుకుంటే ఒట్టు. నచ్చినా నచ్చకపోయినా సలాడ్స్ మాత్రం తినేస్తున్నారు. లక్షల ఖర్చు వృథా . ఎవరికి ఏం అవసరమో.. అదే ఇస్తే సరిపోతుంది కదా?
‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’ ఈ కష్టాలన్నీ తీరుస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటికో, ఆఫీసుకో అందించడమే వ్యాపారంగా చాలా స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదో వేలకోట్ల వ్యాపారం. ఏటా పద్నాలుగు శాతం పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటికే భోజనం మనకేం కొత్త కాదు. స్విగ్గీలూ, జొమాటోలు ధారాళంగా అందిస్తున్నాయి. ఒక్క క్లిక్కు చాలు. కాకపోతే.. అక్కడ ఎవరికైనా ఒకే మెనూ. అదే అన్నం, అదే మునక్కాయ సాంబారు, అదే టమాట పప్పు. అవే వడియాలు. దాంతోపాటే నీళ్ల పెరుగు, నిల్వ పచ్చడి. ఇందులోనే వెజ్, నాన్‌వెజ్ రకాలు. ఊబకాయం ఉన్న రామారావు అయినా, కొలెస్ట్రాల్ సమస్య ఉన్న కృష్ణమూర్తి అయినా చచ్చినట్టు అదే తినాలి. ‘నాకు బీట్రూట్ కర్రీ వద్దు’, ‘నేను ఆలూ సిక్స్టీ ఫైవ్ ముట్టుకోను’ అని మొహం మాడ్చుకుంటే ఎవరూ పట్టించుకోరు. ఈ మధ్యే బిడ్డకు జన్మనిచ్చిన శ్రీలత కూడా ఆ పదార్థాలతోనే సర్దుకోవాలి. ‘నాకు మరిన్ని పోషకాలు కావాలి’ అంటే కుదర్దు. ఎవరి రుచి వారిది, ఎవరి అభిరుచి వారిది. ఎవరి శరీరతత్వం వారిది. ఎవరి పోషక అవసరాలు వారివి. ఇప్పుడు కావాల్సింది.. పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రం కాదు. అచ్చమైన డిజైనర్ ఆహారం.. ‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’ ఆ బాధ్యత తీసుకుంటున్నాయి.
మన నుంచి ఫోన్ వెళ్లగానే.. ప్రాథమిక వివరాలు నమోదు చేసుకుంటారు. రోజుకు మూడుపూటల, రెండుపూటల, ఒక పూట లెక్కన.. వారానికి, పక్షానికి, నెలకు, ఏడాదికి.. సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. వ్యవధి పెరిగేకొద్దీ చందా మొత్తం సహజంగానే తగ్గుతుంది.
సగటున నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకూ వసూలు చేస్తారు. చెల్లింపు జరిగిపోగానే.. న్యూట్రిషనిస్ట్ నుంచి కాల్ వస్తుంది. మన ఎత్తు, బరువు, దీర్ఘకాలిక రుగ్మతలు, ఆరోగ్య లక్ష్యాలు, ఇష్టాలు, అయిష్టాలు, అలర్జీలు, గతంలో జరిగిన సర్జరీలు.. తదితర వివరాలన్నీ తీసుకుంటారు. మన భాగస్వామ్యంతోనే డైట్ ప్లాన్ సిద్ధం చేస్తారు. ఒకరోజు అందించిన ఆహారం.. మరో రోజు అందకుండా ముప్పై రోజుల కాలానికి డైట్ ప్లాన్ సిద్ధం అవుతుంది. రోజూ ఉదయాన్నే ప్యాకేజీని బట్టి ప్యాకెట్లు అందుతాయి. మైక్రోవేవ్ ఒవెన్‌లో వేడి చేసుకుని తినేయడమే. పక్కా పోషకాల లెక్కలతో అందిస్తారు కాబట్టి, భయపడాల్సిన పన్లేదు. ప్రతి ప్యాక్ మీదా క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వు మోతాదు కూడా ఇస్తారు. అవన్నీ మన అవసరాలకు సరిపడా మాత్రమే ఉంటాయి. శాకాహారం (వెజ్), మాంసాహారం (నాన్‌వెజ్), అండాహారం (ఎగ్టేరియన్), కీటో డైట్, వీగన్, బ్యాలెన్స్డ్.. మన ఆరోగ్య లక్ష్యాన్ని బట్టి డైట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నాకు బెండకాయ వద్దు, మష్రూమ్ పడదు, క్యారెట్ అంటే ఇష్టం.. మన ఇష్టాయిష్టాలు నిర్మొహమాటంగా చెప్పొచ్చు. డైటింగ్‌లో ఉండటం అంటే పొట్ట మాడ్చుకోవడమే అనే అపోహను తొలగిస్తున్నాయి ఈ స్టార్టప్స్. నాణ్యమైన దినుసులతో, ఆరోగ్యకరమైన పద్ధతిలో పోషకాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రిల్డ్ సాల్మన్ విత్ క్రీమీ పెస్టో, షెపర్డ్స్ పై, గ్రీన్ టొమాటో చిల్లీ సూప్, రాస్బెర్రీ కోకో స్మూతీ, అవకాడో సూప్.. ఇలా నచ్చిన మెనూ ఎంచుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్ సహా నాన్‌వెజ్ రుచులకూ కొదవలేదు.
హెల్దీఫుడ్ వ్యాపారంలోకి వచ్చినవారంతా దాదాపుగా మాజీ ఊబకాయులే. జీవనశైలి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయినవారూ లెక్కలేనంత మంది. నేటి రిస్సీ, నిన్నటి ఫ్రెష్ ఫుడ్ కంపెనీ వ్యవస్థాపకురాలు సిల్కీ సింగ్ ప్రయాణమూ అలాంటిదే. ఏదో ఓ డైన్ ప్లాన్‌ను ఎంచుకునేది. కొద్దిరోజులకు అది బోర్ కొట్టేది. అంతలో మరొకటి. ఇంకొకటి. దీనివల్ల పెద్దగా ఫలితాలు ఉండేవి కాదు. ‘ఎవరో ఎంపిక చేసే ప్లాన్ అలానే ఉంటుంది. మన ప్లాన్ మనమే ఎందుకు సిద్ధం చేసుకోకూడదు?’ అనే ఆలోచనలోంచి రిస్సీ అనే స్టార్టప్ పుట్టింది. ప్రస్తుతం ఈ అంకుర సంస్థ ఒక్క ముంబై నగరంలోనే రోజుకు ఐదువేల భోజనాలను అందిస్తున్నది.
కొవిడ్.. మనిషికి ప్రాణభయాన్ని రుచి చూపింది. హాయిగా సాగిపోతున్న జీవితాల్లో అమాంతం చొచ్చుకొని వచ్చే కుదుపులు ఎంత ఇబ్బంది పెడతాయో హెచ్చరించింది. వందేండ్లు గ్యారెంటీ ఇవ్వడానికి ఇదేం మార్కెట్ సరుకు కాదు, మనిషి ప్రాణం.. అని కొరడా ఝళిపించి మరీ చెప్పింది. దెబ్బకు విలాసాల దెయ్యం వదిలిపోయింది. జీవనశైలి దారికొచ్చింది. ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అర్థమైపోయింది. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో వంటింటికి అంత సమయం కేటాయించలేని పరిస్థితి. దీంతో ‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’కు గిరాకీ పెరిగింది. కొత్తకొత్త స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. మొదట్లో ఊపు ఎక్కువగానే ఉన్నా.. క్రమంగా మార్కెట్లో సర్దుబాటు జరిగింది. బలమైన పునాదులున్న సంస్థలే నిలదొక్కుకున్నాయి. ‘ఈ వ్యాపారంలో దీర్ఘకాలం నిలబడాలంటే.. కస్టమర్ నమ్మకాన్ని చూరగొనాలి. అతనికి ఫలితాలు చూపించాలి’ అంటారు మార్కెటింగ్ నిపుణులు.
ఫుడ్‌ప్రెన్యూర్స్ చాలామందే ఉన్నారు. నార్త్, సౌత్ తేడా లేకుండా నోరూరించే రుచులను అందిస్తున్నారు. ఇప్పుడు హెల్దీఫుడ్ప్రెన్యూర్స్వంతు. ‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’ను వైవిధ్యమైన వ్యాపారంగా, సృజనాత్మకమైన వ్యాపకంగా చేపడుతున్నారు. కస్టమర్ అభిరుచికి పెద్దపీట వేస్తున్నారు. అతని ఆరోగ్య లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతిమంగా, తమ బ్యాలెన్స్ షీట్ కూడా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
పారాఫిట్
ఇదో ఆరోగ్య రుచుల ప్రపంచం. మీ లక్ష్యం ఏమిటి? బరువు తగ్గడమా, బరువు పెరగడమా, కండరాల సత్తువ పెంచుకోవడమా, డిటాక్స్ కావడమా? ఇవేవీ కాకపోతే.. ఇంకేదైనా తీర్మానమా? మీ మనసులోని మాట పారాఫిట్కు చెబితే చాలు. దాదాపు రెండువందల యాభై రకాల రుచులలోంచి మీకు అవసరమైన వంటకాల్ని సిద్ధం చేస్తారు. వ్యవస్థాపకుడు పరాజ్ ప్రిమ్లానీ.. టీనేజ్‌లో ఊబకాయంతో ఇబ్బందిపడ్డాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ఏదో ఓ పరిష్కారం కనుగొని తనలాంటి ఎంతోమందికి దారి చూపాలని అనుకున్నాడు. ‘పారాఫిట్’ ద్వారా తన కలను నిజం చేసుకున్నాడు. ఇప్పటికే పదివేలమంది కస్టమర్లకు సేవలు అందించాడు. ప్రస్తుతం ఢిల్లీకే పరిమితమైనా దేశమంతా విస్తరించే ఆలోచన ఉంది.
ఫుడ్ డార్జీ
ముంబై కేంద్రంగా పనిచేస్తున్నది. దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించింది. సిద్ధాంత్ భార్గవ వ్యవస్థాపకుడు. తన క్యాంపస్ మిత్రులతో కలిసి స్థాపించాడు. తను స్వతహాగా న్యూట్రిషన్ సైంటిస్ట్. ‘మా దగ్గర కొలతలంటే కొలతలే. ఒక్క గ్రాము తేడా వచ్చినా మా న్యూట్రిషనిస్టులు ఒప్పుకోరు’ అని సగర్వంగా ప్రకటిస్తాడు సిద్దూ. కీటో డైట్‌ను అనుసరించేవారి కోసం ప్రత్యేకమైన మెనూ ఉంటుంది. ఏ వంటకమైనా నెల రోజుల్లో.. రెండోసారి రాకుండా జాగ్రత్త పడుతుంది ఫుడ్ డార్జీ. ఈ సంస్థ వీడియోలకు లక్షలకొద్దీ క్లిక్స్ పడతాయి. ఫుడ్ ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా వర్కవుట్ ప్రణాళిక కూడా సూచిస్తారు.
న్యూట్రి నైన్వన్డైటింగ్లో ఉండటం అంటే పొట్టకట్టేసుకోవడం అనే అపప్రదను తొలగించడమే తమ లక్ష్యమని చెబుతారు న్యూట్రి నైన్వన్ వ్యవస్థాపకులు. ఇక్కడ దేశీ రుచులే కాదు.. మెక్సికన్, థాయ్, చైనీస్ రుచులూ సిద్ధంగా ఉంటాయి. అన్నీ మన ఆరోగ్య లక్ష్యానికి సహకరించేవే.
ఈట్‌ఫిట్
హైదరాబాద్ సహా పన్నెండు నగరాలలో సేవలు అందిస్తున్నది. సబ్‌స్క్రిప్షన్‌తో పన్లేకుండా తినాలనిపించిన ప్రతిసారీ హెల్దీఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. గ్రిల్డ్ కాటేజ్ చీజ్, క్వినోవా సలాడ్, గ్రిల్డ్ వెజిటబుల్ సాండ్విచ్.. ఇలా కోరినన్ని రుచులు. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులకు పోషకాహారాన్ని అందించే బాధ్యత కూడా తీసుకుంది. వ్యవస్థాపకుడు అంకిత్ నగోరీ ఓ సీరియల్ ఆంత్రప్రెన్యూర్. ఆరోగ్యకరమైన పిజ్జాలనూ అందించే ప్రయత్నం చేస్తున్నాడు.
హెల్దిఫై మీ
పదేండ్ల క్రితం తుషార్ వశిష్ఠ తన మిత్రులతో కలిసి స్థాపించాడు. అంతకుముందు తను ఆధార్ సంస్థలో పనిచేశాడు. ఊబకాయం బాగా ఇబ్బందిపెట్టేది. దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో చాలా పరిశోధనలే చేశాడు. అప్పుడు వచ్చిన ఆలోచనే హెల్దిఫై మీ. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో అందరికంటే ముందుంటుందీ సంస్థ. ‘రియా’ పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేసింది హెల్దిఫై మీ. కౌలాలంపూర్, సింగపూర్‌లోనూ శాఖలు ఉన్నాయి. మూడువందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
బరువు తగ్గడం, థైరాయిడ్, బరువు పెరగడం, కొలెస్ట్రాల్.. ఇలా రకరకాల సమస్యలకు, రకరకాల ఫార్ములాలతో ఫుడ్ బాక్స్ అందిస్తున్నాయి ఫుడ్ సబ్స్క్రిప్షన్ సంస్థలు. ఈ ప్రచారం ఎంతవరకు నిజం? ఆహారంతో అనారోగ్యాల్ని జయించవచ్చా? అనే ప్రశ్నకు న్యూట్రిషనిస్టుల నుంచి సానుకూలమైన సమాధానమే వస్తున్నది. ‘ఏ జీవనశైలి సమస్యకైనా ఆహారమే మూలం. జంక్ ఫుడ్ నుంచి పోషకాహారానికి మారడం మంచి పరిణామమే. కాకపోతే, తినే తిండి ఒక్కటే మన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభావితం చేయలేదు. రోజూ వ్యాయామం చేయాలి. వైద్యుల సలహా ప్రకారం మందులు వాడాలి. మద్యం, ధూమపానం తదితర దురలవాట్లను తొలగించుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఫలితాలు. మిగతా విషయాల్లో పక్కాగా ఉంటున్నాం.. తిండి విషయంలోనే మాకు ఇబ్బంది.. అని ఫిర్యాదు చేసేవారికి ఇది అత్యుత్తమ పరిష్కారం’ అని సూచిస్తారు పోషకాహార నిపుణురాలు అపర్ణ కులకర్ణి. ఫుడ్ సబ్స్క్రిప్షన్ మాడల్లోనూ ఉప విభాగాలు పుట్టుకొస్తున్నాయి. కేవలం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కావాలనుకునేవారికి ‘సెండ్ మై టిఫిన్స్’ తరహా స్టార్టప్స్ సాయపడుతున్నాయి. రాగి దోసె, రాగి ఇడ్లి, కొర్రల ఉప్మా వగైరా పదార్థాలు అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన సూప్స్ కోరుకునేవారికి ‘సూప్ఎక్స్’ ఉండనే ఉంది. రుచికరమైన సలాడ్స్ ప్రియులు ‘సలాడ్కింగ్’ను ఎంచుకోవచ్చు. కొన్నయితే ఏకంగా ఫ్యామిలీ ప్యాక్ కూడా అందిస్తున్నాయి.
ఇవే కాదు, భారతీయ ఆరోగ్య ఆహార మార్కెట్లో దాదాపు పాతిక ప్రధాన సంస్థలు ఉన్నాయి. అగ్రస్థానం కోసం పోటీ తీవ్రంగానే ఉంటుంది. డిస్కౌంట్ ఆఫర్లు, సెలెబ్రిటీ ఎండార్స్మెంట్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసులు అధికంగానే ఉంటాయి. నెలకు ఒకటిన్నర కేజీల నుంచి మూడు కిలోలు తగ్గడం ఖాయం.. తరహా హామీలూ వినిపిస్తాయి. ఈ మార్కెట్‌పై దేశీ, విదేశీ పెట్టుబడిదారుల చూపులు ఎప్పుడో పడ్డాయి. దీంతో పెట్టుబడుల ప్రవాహం బాగానే ఉంది. దినదినగండంగా ఉన్న స్టార్టప్స్ ఖాతాలో రాత్రికి రాత్రి వందలకోట్లు జమ అయిన ఉదంతాలూ ఉన్నాయి. ఒకరిద్దరు కౌన్సెలర్లు, ఓ క్లౌడ్ కిచెన్, చిన్నపాటి ఆఫీసుతో వ్యవహారం నడిపించొచ్చు. ఆకట్టుకునే నినాదం, మార్కెటింగ్ మీద పట్టు ఉంటే చాలు. తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించొచ్చు. తామే ఓ న్యూట్రిషనిస్టో, డాక్టరో అయితే గనుక తిరుగులేదు. సొంతంగా ఓ యాప్ డెవలప్ చేయించుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. నేరుగా కస్టమర్ల రారు కాబట్టి, శివార్లలో కిచెన్ పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. దీంతో భారీ భారీ అద్దెలు ఉండవు. పొద్దున్నే.. ముప్పూటలకూ అవసరమైన ఆహారం వెళ్లిపోతుంది కాబట్టి, ఒకరో ఇద్దరో డెలివరీ సిబ్బంది సరిపోతారు. ఆ రోజు డెలివరీ చేయాల్సిన ఆహార పరిమాణం మీద అవగాహన ఉంటుంది కాబట్టి, వృథాకు ఆస్కారమే ఉండదు. ఇక్కడ పెట్టుబడి కంటే, విశ్వసనీయత ప్రధానం. ఫలానా వ్యక్తి, ఫలానా సంస్థ ప్లాన్‌తో నాలుగు కేజీలు తగ్గాడనో, ఐదు కేజీలు తగ్గాడనో.. ఆ నోటా ఈ నోటా జరిగే ప్రచారమే సరిపోతుంది. సాధారణంగా ఆహార తయారీ వ్యాపారంలో లాభం రెండు రెట్లు ఉంటుంది. ఇక్కడ మార్జిన్ అందుకు రెట్టింపు. కార్పొరేట్ దిగ్గజాల కన్ను పడలేదు కాబట్టి, ప్రస్తుతానికి స్టార్టప్స్దే రాజ్యం. ఏదో ఒకరోజు పెద్ద చేపవచ్చి చిన్నచేపల్ని మింగేసినా మింగేయవచ్చు. అందకు ఇంకొంత సమయం ఉంది. ఆలోపే.. స్థిరపడిపోతే సురక్షితంగా ఉంటారు. చాలా అంకుర సంస్థలు ఆ ప్రయత్నంలోనే ఉన్నాయి. కాకపోతే, సగానికి సగం మంది మధ్యలోనే ఆహార దీక్షను విరమిస్తున్నారు. కస్టమర్లను నిలబెట్టుకోవడం ఈ రంగంలో ఓ తీవ్ర సమస్య. ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి మోటివేటర్లను నియమించుకుంటున్నారు. నిత్యం సబ్స్ర్కైబర్లతో టచ్‌లో ఉండటం, లక్ష్యం వైపుగా నడిపించడం వీళ్ల పని. ఒకరికి ఆరోగ్యం. ఒకరికి వ్యాపారం.. ఇద్దరికీ ఉపయోగమే. కాబట్టే, ‘మీల్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్’ రివ్వున దూసుకుపోతున్నాయి. ఇప్పుడిది పదిన్నర వేల కోట్ల రూపాయల మార్కెట్. ఏటా పది నుంచి పదిహేను శాతం పెరుగుదల ఖాయం.
“Banana Leaves | అరటి ఆకుల్లో భోజనం చేస్తే శరీరానికి ఎంత మేలంటే..!”