Hotels in Hyderabad | ‘బాబాయ్ హోటల్’ అంటే బ్రహ్మానందం పొందుతారు!‘వివాహ భోజనంబు’ పిలిస్తే.. ‘ఒహొహ్హొ నాకె ముందు’ అని వాలిపోతాం!‘తెలంగాణ స్పైసీ కిచెన్’ ఎంత ఘాటుగా ఉంటుందో అని ముందుగానే ఓ అంచనాకొస్తాం!!పదార్థం సంగతి అటుంచితే, పేరుతోనే భోజన ప్రియులను కట్టిపడేస్తున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. నవీనతను సంతరించుకున్న స్వచ్ఛమైన పూటకూళ్ల ఇండ్లకు అచ్చమైన తెలుగు పదాలను నామకరణం చేసి జిహ్వ చాపల్యాన్ని హెచ్చిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో విభిన్న కాన్సెప్ట్‌తో, వినూత్నమైన తెలుగు పేర్లతో అతిథి కావోభవ అని ఆహ్వానిస్తున్నారు. పేరులో వింత, తెలుగు వంటకాలనే మమకారం కొంత కలగలసి వారాంతాల్లో నగరవాసులు వీటి ముందు క్యూ కడుతున్నారు.
‘వచ్చి తిని పో’.. ‘బకాసురా’.. రెస్టారెంట్ కబుర్లని చెప్పి ఇలా తిట్టడం ఏంటి? అని ఇదైపోకండి. ఇవి అచ్చంగా మన హైదరాబాద్‌లోని రెస్టారెంట్ల పేర్లే! వంటల్లో ఎన్ని విభిన్న పదార్థాలు ఉంటాయో.. అన్ని వెరైటీ పేర్లతో ఆకర్షిస్తున్నాయివి. శుచికరమైన పేర్లతో రుచికరమైన వంటకాలను ఆస్వాదించండంటూ స్వాగతం పలుకుతున్నారు పాకయాజులు. అలాంటి వినూత్నమైన నామధేయాలున్న వంటకాల కామధేనువుల పరిచయం ఇది..
నాటు- అదిరే ఘాటు
అచ్చతెనుగు నాటు ఎంత పోటుగా ఉంటుందో మనకు తెలిసిందే! ‘నాటు నాటు..’ పాట ఘాటుకు ఆస్కార్ పుటలు కూడా అదిరాయి. అదే పేరుతో జూబ్లీహిల్స్‌లో తలుపులు ‘బార్లా’ తెరుచుకున్న కిచెన్ రెస్టారెంట్ ‘నాటు’. ఇక్కడి ఉలవచారు కోడి పులావ్ ఒక్కసారి రుచి చూస్తే ‘నా ఆట చూడు.. నా పాట చూడు..’ అని ఆత్మారాముడు గంతులు వేయడం ఖాయం. రొయ్యల వేపుడు, కీమా పులావ్ వంటి వెరైటీలు మాంసాహార ప్రియులను మైమరపింపజేస్తాయి. పదార్థం ప్రశస్తంగా ఉంటే సరిపోతుందా! పరిసరాలు కూడా అంత ఘనంగా ఉంటేనే విందు పసందుగా సాగుతుంది. అలాంటి వాతావరణం ‘నాటు’లో నీట్‌గా కల్పించారు రెస్టారెంట్ నిర్వాహకులు. తెలంగాణ ప్రైడ్‌గా భావించే నకాశి చిత్తరువులు రెస్టారెంట్ గోడలపై దర్జాగా కొలువుదీరి అతిథులకూ దర్పాన్ని తెచ్చిపెడతాయి.
చిరునామా: రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్
వేళలు: మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు
రాగి- రుచుల్లో సాగి
మేళకర్త రాగాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే! ఆహారంలో సత్వర సత్తువనిచ్చే పదార్థం మాత్రం రాగి! పేరుకే తృణధాన్యం కానీ, మేలు చేయడంలో ఘనమైనది. ముఖ్యంగా తరతరాలుగా తెలుగువారు రాగులతో సరాగమాడుతూనే ఉన్నారు. ఉదయాన్నే జావగా సేవించి నరనరానికీ కొత్త జీవం పోస్తారు. వేసవిలో అంబలి కాచుకొని బెబ్బులిలా విరుచుకుపడతారు. ఇంతటి ప్రశస్తమైనది కావడంవల్లే జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌కు ‘రాగి’ అని పేరు పెట్టుకున్నారు. రాయలసీమ రుచులకు ఇక్కడ పెద్దపీట వేశారు. అవిసెలను పనీర్‌తో సలసలా వేగించే వేపుడు ఇక్కడ ప్రత్యేకం. వెదురు చికెన్‌కు పెట్టింది పేరు. మక్కజొన్న వడలు, మటన్ పులావ్, గుత్తివంకాయ పులావ్ ఒకటేమిటి స్వదేశీ పాకాలతోపాటు విదేశీ రుచులు సైతం ‘రాగి’లో భోజన ప్రియులను స్వర్గంలో జోగేలా చేస్తాయి.
చిరునామా: రోడ్ నంబర్ 78, జూబ్లీహిల్స్
వేళలు: మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు
తెలుగు మీడియం… వెరైటీల పోడియం
తెలుగు అంటే ఆవకాయ. తెలుగు అంటే పులిహోర. అమ్మముద్దను మించిన తెలుగుదనం ఏముంటుంది చెప్పండి? అచ్చమైన తెలుగుదనంతో మన వంటకాలను మనస్ఫూర్తిగా వండివడ్డిస్తున్న విద్యుత్ దీపకాంతుల పూటకూళ్ల లోగిలి ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్. కారం ఇడ్లీ అంటే మనకు మమకారం. పెనం మీద అట్టుడుకుతున్నదంటే.. మనం ఆగుతామా?! కేవలం తెలుగువారి వంటలే ఇక్కడ ఉంటాయనుకుంటే పొరపాటు. తెలుగు మీడియంలోనూ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లిష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉన్నట్టే.. ఇక్కడ ఉత్తరాది ఉత్తమ వంటలు, పాశ్చాత్య పాకాలు అడిగిన వెంటనే ప్రత్యక్షమవుతాయి. అన్నిటికీ మించి ఇక్కడ ప్రత్యేకంగా వండి వడ్డించే.. ముద్దపప్పు, ఆవకాయ అన్నం తినేటప్పుడు అప్రయత్నంగా లొట్టలేస్తాం, ప్రయత్న పూర్వకంగా నాలుగు ముద్దలు ఎక్కువగా లాగించేస్తాం! కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి.
చిరునామా: రోడ్ నంబర్ 46, జూబ్లీహిల్స్
వేళలు: మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు, రాత్రి 7 గంటల నుంచి 10.30 వరకు
ఇట్లు… నీ ప్రియమైన..
లేకలేక లేఖ రాసినా, అందులో లెక్కలేనన్ని భావాలు చెప్పడం చేతకాకపోయినా.. ‘ఇట్లు’ అని ముగించాల్సిందే! ఇట్లు కింద ఉన్న సంబోధనే లేఖ సారాంశాన్ని దాన్ని అందుకున్న వ్యక్తికి చేరువచేస్తుంది. ఆ క్షణాన తిట్లు తిట్టుకున్నా.. లేఖలోని రేఖలు ఆ వ్యక్తి మనోఫలకంపై శాశ్వతంగా ముద్రితమవుతాయి. తన జ్ఞాపకాల మెట్లలో ఈ ఇట్లు మరపురాని సోపానమై నిలుస్తుంది! జూబ్లీహిల్స్‌లో కొలువుదీరిన ఈ ఇట్లు రెస్టారెంట్ కూడా ఇటువంటిదే! అక్కడి ‘రాజ భోజనం’ ఆరగింపు తర్వాత ఇంట్లో సాదాసీదా లంచ్ చేస్తున్నా ‘ఇట్లు’ ముచ్చట్లు మదిలో మెదులుతాయి.టిఫిన్లు, భోజనం, సాయంత్రం అల్పాహారాలు ఒకటేమిటి పాకశాస్త్రంలో పేర్కొన్న అన్ని వెరైటీలనూ ఈ రెస్టారెంట్లో రుచి చూడొచ్చు. ‘థాలీ’ తినే శుభవేళ.. కలుగుతుంది ఆనంద హేల! అమ్మవంటను మరిపించేలా ఇక్కడ పదార్థాలు ఉంటాయి. ‘ఇట్లు నీ పాదసేవలో..’ అమ్మతో వెళ్లి చక్కటి విందును అందివ్వండి.
చిరునామా: రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్
వేళలు: ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు
రస- రుచుల మాలిక
పల్లె తెలంగాణలో పసందైన రుచులు కోకొల్లలు. వాటిని గొప్పగా వండి, వడ్డించే నలభీములు దొరికారా లొట్టలేసుకుంటూ తినాల్సిందే! అలాంటి తెలంగాణ వంటకాలను ప్రత్యేకంగా రుచి చూపిస్తున్నది సికింద్రాబాద్‌లో కొత్తగా వెలిసిన ‘రస’ రెస్టారెంట్. ఈ మల్టిక్విజిన్ రెస్టారెంట్లో పదార్థాలు మాత్రమే కాదు.. పరిసరాలు, పద్ధతులూ అన్నిటా తెలంగాణ సంస్కృతికి పెద్దపీట కనిపిస్తుంది. జాజు రంగులో మట్టి గోడలను మరిపించే పార్టిషన్స్, తడకల పందిరి లోగిలి, బతుకమ్మ బొమ్మలు ఒకటేమిటి రెస్టారెంట్ అంతా పల్లెదనం ఘనంగా దర్శనమిస్తుంది. రుచుల దగ్గరికి వస్తే పాయా, బిర్యానీ, మటన్ వెరైటీలు, చికెన్ కూరలు, నాటుకోడి పులుసు, బగారా బైంగన్, మిర్చీ కా సాలన్ వంటి మన వంటకాలు ముక్కుపుటాలను అదరగొడతాయి. మక్కవడలు, చుక్కకూర వెరైటీలు మరింత ఖుషీ చేస్తాయి.
చిరునామా: ఏఎస్ రావ్ నగర్, సికింద్రాబాద్
వేళలు: ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు (వేళల్లో మార్పు ఉండొచ్చు)