మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజుకు 10,000 అడుగులు నడవడం తప్పనిసరంటూ ఇప్పటివరకు పలువురు నిపుణులు చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ ట్రాకర్లు, వెల్నెస్ యాప్స్ కూడా దాన్ని జీవనశైలిలో భాగం చేశాయి. దాంతో తక్కువ నడిస్తే సరిపోదనే భావన అందరిలో మొదలైంది. అయితే కొత్త అధ్యయనాలు మాత్రం ప్రతిరోజూ పదివేల అడుగులు వెయ్యనవసరం లేదని 4,000 అడుగులు నడిస్తే చాలని వెల్లడించాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ పరిశోధనలో భాగంగా వేలమంది వృద్ధ మహిళలను గమనించారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే నడిచిన వారితో, తకువగా నడిచిన వారితో పోలిస్తే రోజుకు 4,000 అడుగులు నడిచిన వారిలో హృదయ సంబంధిత వ్యాధులు, అకాల మరణం లాంటి సమస్యలు తకువగా ఉన్నట్లు తేలింది.
వారానికి మూడు రోజుల పాటు ఎకువ నడిచిన మహిళల్లో మరింత మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ అధ్యయనం వృద్ధ మహిళలపైనే జరిపినా, ఇందులోని ఫలితాలు అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా యువతకీ వర్తిస్తుందని పరిశోధకుల మాట. రోజుకు 4,000 అడుగులు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దాంతోపాటు రోజుకు 6,000-8,000 అడుగులు నడిస్తే హృదయ ఆరోగ్యం మరింత మెరుగుపడి కండరాలు బలపడతాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఎలా పాటించాలి: వారంలో రెండుమూడు రోజులు.. 4,000 అడుగులు నడవడం మొదలుపెట్టండి. తర్వాత క్రమంగా పెంచండి. ఒకేసారి ఎకువసేపు నడవకుండా, రోజంతా 10 నుంచి 15 నిమిషాలపాటు చిన్నచిన్న నడక సెషన్లుగా విభజించుకోవచ్చు. స్మార్ట్ వాచ్, ఫోన్ యాప్లను ఉపయోగించి మీ అడుగులను గమనించండి. సాధారణం వేగంతో కూడిన నడక 40 నిమిషాల్లో 4,000 అడుగులకు చేరుతుంది. ఇలా రోజూ నడవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా వృద్ధులకు ఇది చాలా ప్రయోజనకరం. మరెందుకు ఆలస్యం నిండైన ఆరోగ్యం కోసం ఈ రోజే మీ నడక ప్రారంభించండి.