Health News | మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. ఇటీవలే రజస్వల అయింది. ఆ తర్వాత ఆడపిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతుందని అంటారు. మా పాప త్వరగా ఎత్తు పెరిగేందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెబుతారా?
– ఓ పాఠకురాలు
ఎత్తు.. వంశ పారం పర్యంగా వస్తుంది. పిల్లల ఎత్తు సాధారణంగా కుటుంబసభ్యుల ఎత్తును బట్టి ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు రజస్వల అయిన వెంటనే పిల్లలు పొడవు పెరగడం ఆగిపోదు. కనీసం మరో మూడేండ్లు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దశలో మనమిచ్చే పోషకాహారం వాళ్ల ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. అయితే, ఎత్తు పెరగడానికంటూ ప్రత్యేక ఆహారం ఉండదు. ఎదిగే వయసులో సమతులాహారం అవసరం. అలాగే, శారీరక వ్యాయామం అత్యవసరం. ఈ రెండూ పిల్లలు పెరిగేందుకు అతి ముఖ్యమైనవి. పెరిగే వాళ్లకు ప్రొటీన్, క్యాల్షియం అవసరం చాలా ఉంటుంది.
అందుకే పాలు, పాల పదార్థాలు, గుడ్లు, మాంసం.. లాంటివి అందివ్వాలి. అలాగే పిండిపదార్థాల కోసం అన్నం, గోధుమలు, రాగి, జొన్న లాంటివి పెట్టొచ్చు. అయితే మైదా, కార్న్‌ఫ్లోర్ తదితర రిఫైన్డ్ ఉత్పత్తులకు మాత్రం దూరంగా ఉంచాలి. మైదాకు సంబంధించిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా అమ్మాయిలు త్వరగా రజస్వల అవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ల కోసం పండ్లు ఎక్కువగా పెట్టాలి. నెలసరి సమయంలో రక్తస్రావం అవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది ఎముకల ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికోసం దానిమ్మ, బెల్లం, ఖర్జూరం, నువ్వుల్లాంటివి పెట్టాలి. శరీరం ఐరన్‌ను శోషించుకోవాలంటే విటమిన్-సి అవసరం. జామ, బత్తాయిల్లాంటి పండ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా అమ్మాయిల ఆహారాన్ని తీర్చిదిద్దితే తన ఎదుగుదల ఆరోగ్యంగా సాగుతుంది.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
“Menarche నా కూతురు పదేండ్లకే పెద్ద మనిషి అవుతుందేమో అనిపిస్తుంది.. కారణం అదేనా?”