వేదకాలం నుంచి మామిడి పండ్లు ఉన్నట్లు వర్ణనలున్నాయి. ఉగాది నాడు పూజలో మామిడి కాయ, ఇతర పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదిస్తాం. మామిడికాయ ఆకారం కళాకారులకు ఎంతో ఇష్టం! దుస్తుల మీద, నగలలో, తివాచీలపై, దుప్పట్ల మీద మామిడి పిందె డిజైన్లు తీర్చిదిద్దుతున్నారు. బంగినపల్లి, నీలం, మల్గోవ, కౌసర్, రసాలు, అల్ఫాన్సో, సువర్ణ రేఖ మొదలైన మామిడి రకాలు మనదగ్గర విరివిగా పండుతున్నాయి. పుల్లని కాయలతో పచ్చళ్లు, ఆవకాయలు, వరుగులు, పులిహోర, సలాడ్ తయారు చేసుకోవచ్చు. వేసవిలో విరివిగా పండే మామిడి ఫలాల నుంచి వాణిజ్య సంస్థలు రసాలు తీసి, నిల్వ చేస్తున్నాయి.
వీటిని వివిధ పేర్లతో ఏడాది పొడవునా అమ్ముతున్నాయి. మామిడి పండులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, చక్కెర, పీచు పదార్థాలు బాగా ఉంటాయి. పచ్చి కాయలను సైతం ముక్కలు కోసి ఉప్పు, కారం అద్దుకొని తినొచ్చు. వేసవిలో తాజా మామిడి పండుని పెరుగన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు! మామిడి పండే కాదు, ఆకులు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఔషధంగా పని చేస్తాయి. లేత ఆకులను నూరి పెరుగుతో తింటే అతిసారం తగ్గుతుంది. నిద్రలేమి గలవాళ్లు రాత్రి తియ్యని మామిడి పండు తింటే హాయిగా నిద్రపడుతుంది. కాల్చిన మామిడాకుల బూడిదకు కాలిన గాయాలను మాన్పే గుణముంది.
మామిడి పండులోని టెంకను విత్తనంగా నాటి గానీ, ఆరోగ్య వంతమైన చెట్టు కొమ్మ అంటుతో గాని కొత్త మొక్కను సిద్ధం చేసుకోవచ్చు. జూన్ నుంచి డిసెంబరు నెలల్లో ఈ మొక్కలను నాటుకోవచ్చు. ‘ట్రీ టాపింగ్ గ్రాఫ్టింగ్’ ద్వారా ఒకే మామిడి చెట్టుకు అనేక రకాల మామిడి పండ్లను కాయించవచ్చు. 3, 4 నెలలకు ఓసారి ఎండిన కొమ్మలను కొట్టివేసి కొంచెం కత్తిరింపులు చేస్తే కొత్త చిగుళ్లతో చెట్టు కళకళలాడుతుంది. నవంబర్లో పశువుల ఎరువు వేసి, చీడ రాకుండా చూసుకుంటే జనవరి, వరకు పూతవచ్చి మార్చికి పిందెలు, కాయలై మే నాటికి పండ్లను ఇస్తుంది. ఇప్పుడు ఏడాది పొడవునా కాసే మామిడి రకాలున్నాయి. వాణిజ్యపరంగా వీటినే సాగు చేస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు