జిమ్‌లకు వెళ్లే వాళ్లు పెరగడం, ఆరోగ్యం మీద శ్రద్ధ అధికం అవడంలాంటి కారణాలతో నేటి తరం జనాభాకు సంబంధించి ఆహారంలో అధిక శాతం ప్రొటీన్ చేరుతున్నది. ముఖ్యంగా ప్యాకెట్లలో వచ్చే పొడులు, బార్లు, సెరియల్స్… ఇలా రకరకాల ఆహార పదార్థాలు ప్రొటీన్ అందించేవిగా జనానికి చేరువ అవుతున్నాయి. అయితే వీటిలో ఆరోగ్యకరమైన వాటి శాతం ఎంత… ప్రొటీన్‌ను అందించేవిగా చెబుతున్న ఇవి ఎంత వరకూ మంచివి… అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలో హై ప్రొటీన్ ఫుడ్‌గా చెబుతున్న 4000 ఆహార పదార్థాల మీద పరీక్షలు జరిపారు.
స్పెయిన్ వేదికగా జూన్ 2022 నుంచి మార్చి 2024 మధ్యలో జరిగిన ఈ అధ్యయనంలో ఎనర్జీ బార్లు, బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, యోగర్ట్, వృక్ష ఆధారిత మాంసంలాంటి వివిధ పదార్థాలను పరీక్షించారు. అయితే వీటిలో ప్రొటీన్‌తో పాటు చక్కెరలు, కార్బొహైడ్రేట్లు, సంతృప్త కొవ్వులు, సోడియంలాంటి పదార్థాల శాతమూ ఎక్కువగానే ఉంది. ఇవేం ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. మొత్తంగా హై ప్రొటీన్ ఫుడ్‌గా చెప్పే ఈ ప్రాసెస్డ్ ఫుడ్‌లో 90 శాతం ఇదే కోవలోనివని తేల్చేశారు. ఇందులకు బదులుగా మాంసం, పాలు, గుడ్లు, పాల పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ని పొందవచ్చని చెబుతున్నారు. వెగాన్ల కోసమైతే సోయా, చిక్కుళ్లు, శనగల్లాంటివి సూచిస్తున్నారు.