వర్షాకాలం అంటేనే లేనిపోని రోగాలు, ఇన్ఫెక్షన్లు పలకరిస్తుంటాయి! వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే.. అద్భుతమైన ఇమ్యూనిటీని సొంతం చేసుకోవచ్చు.
సీజనల్ పండ్లు : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సీజనల్ పండ్లను ఆశ్రయించాలి. ఆపిల్, జామ, లిచీ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి.
అల్లం: వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. యాంటి ఆక్సిడెంట్లతో నిండిన అల్లం.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే.. వర్షాకాలంలో అల్లం టీ తాగడం అలవాటు చేసుకోవాలి.
వెల్లుల్లి: యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ లక్షణాలతో నిండిన వెల్లుల్లి.. ఇమ్యూనిటీని అమాంతం పెంచేస్తుంది. కూరల్లో కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటే చాలు.. ఎలాంటి రోగాలు దరిచేరవు.
పెరుగు: వర్షాకాలంలో పెరుగు తీసుకుంటే.. జలుబు చేస్తుందని భయపడుతుంటారు. కానీ, పెరుగు గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. శరీరంలోకి చెడు బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది.
పసుపు: ఇందులో లభించే ‘కర్క్యుమిన్’ అనే సమ్మేళనం.. ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. జ్వరం, దగ్గు వంటి సమస్యలను తరిమికొడుతుంది. రోజువారీ వంటల్లో కాస్త పసుపు వేస్తే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి లభిస్తుంది.
మునగ: విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియంతో నిండి ఉండే మునగాకులు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. రోగనిరోధక శక్తినీ బలోపేతం చేస్తాయి.