శరీరంలో ఏదైనా భాగంలో కణాల పెరుగుదల అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించడాన్ని క్యాన్సర్‌గా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల అనారోగ్యానికి, మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణంగా ఉంటున్నది. ఇప్పుడు ఇతర కారకాలతోపాటు వైరస్లు కూడా కొన్ని రకాల క్యాన్సర్లను కలగజేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు ఆరోగ్య రంగ నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్లు క్యాన్సర్‌ను ఎలా కలగజేస్తాయి, వాటిని నిరోధించడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అవగాహన ఉండాలి.
ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అతి సూక్ష్మ అంటురోగాల కారకాలే వైరస్లు. ఇవి బయటి వాతావరణంలో నిర్జీవులుగా ఉంటాయి. ఒకసారి జీవిలో ప్రవేశించాయంటే ఆ జీవి కణాల్లో అభివృద్ధి చెందుతూ జీవ లక్షణాలను ప్రదర్శిస్తాయి. అయితే, కొన్ని రకాల వైరస్లు అవి ఆశ్రయించిన (హోస్ట్) జీవి కణాల పనితీరులో కలిసిపోయేలా మార్పుచెందుతాయి. దీనివల్ల కణాల సాధారణ విధుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఇలాంటి వాటిలో ‘ఆంకోజెనిక్’ లేదా ‘ట్యూమర్ వైరస్లు’గా పిలిచే అనేక వైరస్లు మనుషుల శరీరంలో క్యాన్సర్ అభివృద్ధికి కారణంగా ఉంటాయి. వీటిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ), హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు (హెచ్‌బీవీ, హెచ్‌సీవీ), లాలాజలం, ఇతర శరీర ఫ్లూయిడ్ల ద్వారా వ్యాపించే ‘ఎప్స్టీన్ బార్ వైరస్’ (ఈబీవీ), హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) లాంటివి ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ కారక (ఆంకోజెనిక్) వైరస్‌లుగా ఉన్నాయి.
ఈ వైరస్లు క్యాన్సర్‌కు దారితీసే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. కాకపోతే అవి వ్యాపించే విధానం మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు, హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఆంకోప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది కణం పనితీరు సాఫీగా సాగిపోయే ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. నియంత్రణ లేకుండా కణాలు పెరిగిపోయే క్రమాన్ని ప్రోత్సహిస్తుంది. చివరికి ప్రాణాంతకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. అదేవిధంగా, హెపటైటిస్ బి, సి వైరస్లు కూడా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. హెపటో సెల్యులర్ కార్సినోమా అనే క్యాన్సర్ అభివృద్ధి చెందే ముప్పును పెంచుతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులలో, హెచ్ఐవీ సోకిన వారిలో వైరస్ సంబంధిత క్యాన్సర్లు అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో క్యాన్సర్ ముప్పు వైరల్ ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం సంవత్సరానికి ఇరవై లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు క్యాన్సర్ కారక వైరస్‌లతో (ఆంకోజెనిక్ వైరస్లు) సంబంధం కలిగి ఉన్నాయి. దాదాపు 90 శాతం గర్భాశయ క్యాన్సర్లకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ), కాలేయ క్యాన్సర్లలో ఎక్కువ భాగం హెపటైటిస్ బి (హెచ్‌బీవీ), హెపటైటిస్ సి (హెచ్‌సీవీ)లు కారణం అవుతున్నాయి. అయితే, వైరస్ ఇన్ఫెక్షన్లు, వాటి కారణంగా క్యాన్సర్లు రాకుండా నివారించడంలో ప్రభుత్వాలు చేపట్టే ప్రజా ఆరోగ్య కార్యక్రమాలే కీలకపాత్ర పోషిస్తాయి.
వైరస్ల వల్ల అభివృద్ధి చెందే క్యాన్సర్లను నిరోధించడానికి ఆయా రకాల వైరస్ల వ్యాప్తిని తగ్గించడం, టీకాలు వేయడం, ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం, ఇన్ఫెక్షన్లకు తగిన చికిత్స అందించడం వంటి బహుళ నమూనా (మల్టీ మోడల్) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
క్యాన్సర్ నివారణలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని రుజువైంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ క్యాన్సర్‌పై పోరాటానికి హెచ్‌పీవీ టీకా సమర్థంగా పనిచేస్తుంది. అదేవిధంగా, హెపటైటిస్ బి వైరస్‌తో వ్యాపించే కాలేయ క్యాన్సర్ ప్రాబల్యాన్ని తగ్గించడంలో హెపటైటిస్ బి టీకాలు ప్రభావవంతమైన పరిష్కారంగా చెప్పొచ్చు. ప్రజారోగ్య ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా చిన్న వయసులోనే అవసరమైన టీకాలు వేయించుకోవడం, అధిక టీకా రేట్లు నమోదు కావడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి.
గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు… పాప్ స్మియర్ టెస్ట్, హెచ్‌పీవీ పరీక్షలు చేయించుకోవడం వంటివి వైరస్‌లతో వచ్చే క్యాన్సర్లను ముందుగా గుర్తించేందుకు ఉపకరిస్తాయి. ముఖ్యంగా ముప్పు ఎక్కువగా ఉన్న వారి విషయంలో క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. చికిత్సను సులభతరం చేస్తాయి.
హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ వంటి దీర్ఘకాలిక వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీవైరల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటితో వైరస్ స్థాయులను సమర్థంగా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా క్యాన్సర్ అభివృద్ధి చెందే ముప్పును కూడా తగ్గించవచ్చు. హెపటైటిస్ సి చికిత్సలో ప్రత్యక్షంగా పనిచేసే డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్ ఏజెంట్ల పురోగతి పూర్తి వైరస్ నిర్మూలనకు, క్యాన్సర్ తగ్గడానికి అవకాశం ఇస్తుంది.
వైరస్లు, కాన్సర్ల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలకు తెలియజేయడంలో అవగాహన కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి, టీకాల ప్రాముఖ్యం, వ్యాధుల బారినపడటాన్ని తగ్గించడానికి సురక్షిత చర్యలు తీసుకోవడం వంటివి ఈ వ్యాధుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయి. వ్యాధి నిరోధకత పెంపు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు సులభంగా సోకుతాయి. కాబట్టి ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా హెచ్ఐవీ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న సమూహాలు ఎదుర్కొనే ముప్పును తగ్గించడానికి తగిన టీకా కార్యక్రమాలు, స్క్రీనింగ్ చర్యలు దోహదపడతాయి.
వైరస్లు సాధారణ జలుబు మొదలుకుని క్యాన్సర్ల వ్యాప్తి వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారకాలుగా ఉంటాయి. ఈ సవాలును సమర్థంగా ఎదుర్కోవడానికి వివిధ రంగాల నుంచి సమష్టి కృషి అవసరమవుతుంది. వైరస్ ప్రేరిత, వైరస్ సంబంధిత క్యాన్సర్లను నివారించడంలో టీకాలు, స్క్రీనింగ్, యాంటీవైరల్ థెరపీలు కీలకమైన అంశాలు. ఈ రక్షణ చర్యలపై ప్రభుత్వాలు, ఆరోగ్య రంగ సంస్థలు దృష్టి సారించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులను కూడా మెరుగుపర్చుకోవచ్చు. అయితే, వైరస్లు, క్యాన్సర్ల మధ్య పరస్పర చర్యలపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాబట్టి, క్యాన్సర్లను నివారించే దిశగా ఔషధాలు, చికిత్సలు అభివృద్ధి చేసే దిశగా నిరంతర అధ్యయనం, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.