Honey Tulsi And Neem Leaves | చలికాలంలో చాలా మందికి సహజంగానే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో చర్మం పగులుతుంది కనుక చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఖరీదైన క్రీములు వాడాల్సిన పనిలేదు. పలు ఆహారాలను రోజూ ఉదయాన్నే తీసుకుంటే చాలు చర్మానికి సంరక్షణ లభిస్తుంది. అలాగే పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటంటే.. తేనె, తులసి ఆకులు, వేప ఆకులు. ఈ మూడింటినీ మిశ్రమంలా చేసి ఈ సీజన్లో రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఆయుర్వేద ప్రకారం తేనె, తులసి ఆకులు, వేపాకులు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో రోజూ ఉదయం వీటిని తీసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. పలు రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. నాలుగు తులసి ఆకులు, నాలుగు వేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి అందులో కాస్త తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చలికాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ పోతుంది. అలాగే గొంతు సమస్యలు తగ్గుతాయి. గొంతులో ఉండే నొప్పి, మంటతోపాటు గొంతులో ఉండే కఫం కూడా పోతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం బయటకు వస్తుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. చలికాలంలో చాలా మందికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్ణ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఉండవు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
వేపాకులు, తులసి ఆకులు సహజసిద్ధమైన డికంజెస్టెంట్స్గా పనిచేస్తాయి. అంటే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే తేనె గొంతులో కలిగే ఇరిటేషన్ను తగ్గిస్తుంది. కనుక ఈ మిశ్రమాన్ని తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థలో ఉండే శ్లేష్మం మొత్తం కరిగిపోతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతగానో మేలు చేస్తుంది. వేపాకుల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మానికి సహజసిద్ధమైన కాంతి వస్తుంది. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.