Skin Cancer | వయోభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను గమనిస్తుంటే ఎవ్వరికైనా శరీరంలో చిన్న మార్పు కనిపించగానే వెన్ను జలదరిస్తుంది. శరీరం లోపలి అవయవాలలో జరిగే మార్పులను లక్షణాలు తీవ్రంగా కన్పించే దాకా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ, మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు, స్కిన్ ట్యాగ్ వంటివి కన్పించగానే ఉలిక్కిపడుతుంటారు. క్యాన్సర్ ఏమో అని భయపడుతూ ఉంటారు. అందుకే వాటిపై అవగాహన పెంచడానికి మీ కోసం ఈ వివరాలు.
మన శరీరంలో అతి పెద్ద అవయవం మన చర్మం.శరీరాన్నంతటిని కప్పి రక్షణ కవచంలాగా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ విటమిన్ ‘డి’ తయారీకి ఉపయోగపడుతుంది. మన చర్మంలో పైన ‘ఎపిడెర్మిస్’, లోపల ‘డెర్మిస్’ అనే రెండు పొరలు ఉంటాయి. ఎపిడెర్మిస్‌లో స్క్వామస్ (Squamous) సెల్స్, వాటి కింద బేసల్ సెల్స్ ఉంటాయి. ఎపిడెర్మిస్‌లో కిందభాగాన ఉండే మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే మెలనిన్ (Melanin) వలన మన చర్మపు రంగు నిర్ణయించబడుతుంది. ఎపిడెర్మిస్ కింద ఉండే ‘డెర్మిస్’లో రక్తము, లింప్ వ్యవస్థ, వెంట్రుకల కుదుళ్లు, స్వేదం, సెబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే సీబమ్, మరియు నూనెల వలన శరీరం పొడిబారి పోకుండా, తేమగా ఉండటమే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా నిలకడగా ఉంటుంది. టీనేజ్‌లో, ఇతర వయస్సులలో హార్మోన్ల అసమతుల్యత వలన నూనె గ్రంథులు (సెబాషియస్ గ్లాండ్స్) ఎక్కువగా సీబమ్‌ను విడుదల చేయడం వలన జిడ్డుతనం ఎక్కువై మొటిమలు, గడ్డలు (యాక్నీ) వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అవి తీవ్రంగా ఉన్నప్పుడు వాటి తాలుకు మచ్చలు, గుంటలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే హెచ్‌పీవీ వైరస్ వలన పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా, కొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను (Warts)ను కలిగించే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) క్యాన్సర్ కారకం కాదు. సెక్సువల్ కాంటాక్ట్ వలన మర్మావయవాల దగ్గర వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. హెచ్‌పీవీ-16, 18 మొదలగు వైరస్ రకాలను ‘ఆంకోవైరస్’లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎటువంటి పులిపిరి కాయలను కలుగజేయవు కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. కచ్చితమైన కారణం తెలియకుండా అధిక బరువు వల్లనో, జన్యుపరమైన కారణాల వల్లనో ఏ వయసులో వారికైనా కన్పించేవి స్కిన్ ట్యాగ్స్ (Skin tags) వీటి వలన ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, పెద్ద సైజులో కన్పించే భాగాలలో ఉంటే తీసివేయించుకోవడం మంచిది. సాధరణంగా పెసర గింజంత ఉండే ఈ స్కిన్ ట్యాగ్స్, గోల్ఫ్ బాల్ సైజులో కూడా పెరగవచ్చు. చాలా అరుదుగా వీటి రంగులో మార్పు, రక్తం కారటం వంటి లక్షణాలు కన్పించి స్కిన్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు, కాకుండా 20 ఏళ్ల తర్వాత మచ్చలు వచ్చి అవి సరైన ఆకారంలో లేకుండా రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది.
శరీరంలో అనేక ప్రాంతాలలో సాఫ్ట్ టిష్యులతో ఏర్పడే కొవ్వు గడ్డలనే ‘లైపోమా’ అంటారు. ఇది అక్కడక్కడ ఒకటి రెండూ లేదా శరీరమంతా ఉండవచ్చు. ఎడిపోస్ టిష్యూలతో ఏర్పడే ఈ ప్రమాదకరం కాని గడ్డలు శరీరంలోపల అవయవాల మీద కూడా ఏర్పడితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చర్మం కింద కాని, రొమ్ములో కాని గడ్డలు మెత్తగా, కదులుతూ, కొద్ది వారాలుగా ఎటువంటి మార్పులేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం చేతితో తాకినప్పుడు గట్టిగా రాయిలాగా ఉండటం, చర్మం లోపలి గడ్డ కదలకుండా ఉండటం, గడ్డలో ఈ మార్పులు గమనిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అనుమానించాల్సి ఉంటుంది.
గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కన్పిస్తే నిర్లక్ష్యం చేయకూడదని గ్రహించాలి. లైపోమాలు కూడా ఎటువంటి నొప్పిని కలుగజేయవు. క్యాన్సర్ కణితులు కూడా తొలిదశలో అస్సలు నొప్పిని కలుగ చేయవు. కానీ, పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపిస్తుండటం వలన తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. పైగా చికిత్సకు అంత తొందరగా లొంగవు. మన దేశంలోని శరీరాలలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వలన స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్ ప్రధానంగా బేసల్‌సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రెండు రకాలుగా ఉంటుంది. 90శాతం బేసల్‌సెల్ కార్సినోమా రకానికి చెందినవి ఉంటాయి. మన దేశంలో కూడా నాన్ మెలనోమాస్కన్ క్యాన్సర్స్ పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నా.. అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. 50 ఏళ్లు పైబడ్డాక కన్పించే ఈ క్యాన్సర్స్ ఆల్ట్రా వయోలైట్ (UV-rays) కిరణాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాశ్చాత్య దేశాలలో శరీరాన్ని ట్యాన్ చేయటానికి ఉపయోగించే ట్యాన్ బూత్స్ వలన, బాగా తెల్లగా ఉన్నవారిలో, నీలం రంగు కళ్లు ఉన్నవారిలో, పురుషులలో ఎక్కువగా ఉంటాయి. శరీరం మీద ఎక్కడైనా ముఖ్యంగా ఎండకు గురయ్యే శరీర ప్రదేశాలలో చర్మం రంగులో మార్పుతోపాటు, మాననిపుండు, స్కిన్ ప్యాచ్ లాగా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
చాలా వరకు స్కిన్ క్యాన్సర్ వందశాతం నయం చేయగలము. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించటమేకాకుండా, మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను కూడా చంపివేయటానికి (అతి క్రియో చల్లని) లేదా లేజర్‌తో చికిత్స చేస్తూ ఉంటారు. రేడియేషన్ మరియు కీమో
థెరఫీలు అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. స్కిన్ క్యాన్సర్‌కు కీమోథెరపీని క్యాన్సర్ వచ్చిన ప్రదేశానికి మాత్రమే ఆయింట్మెంట్ రూపంలో వాడే పూత మందులాగా కూడా ఇస్తారు. సర్జరీ చేసి తొలగించిన చర్మం ఎక్కువగా ఉన్నప్పుడు మిగతా భాగాల నుంచి స్కిన్ తీసి, స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. సన్ స్క్రీమ్ లోషన్లు ఎండకు గురయ్యే శరీరభాగాలకు పై పూతగా రాసుకోవటం, శరీరాన్ని బాగా కప్పి ఉంచే దుస్తులు ధరించటం, ఎండకు బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించటం, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం, వీలైనంత వరకు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 3 గంటలవరకు ఉండే ఎండకు బయటకు తిరగకుండా ఉండటం మంచిది. ఇలా చేస్తే ఈ చర్మ క్యాన్సర్‌ను కొంత వరకు దూరంగా ఉంచగలుగుతారు. మామూలుగా చర్మ సంరక్షణకు కూడా ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి.
– డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ
డైరెక్టర్ & చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్
రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్
సంప్రదించవలసిన నం : 7799982495
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
పుట్టుమచ్చలో మార్పులు క్యాన్సర్‌కు సంకేతం
ఈ చలికాలంలో చర్మం పొడిబారుతుందా? ఈ చిట్కాలు పాటించండి
ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి
అపోహలు వద్దు! చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే..