Heart Attack : దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది గుండె రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యానికి కీడు చేసే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. కాబట్టి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రమాదమే. మన అలవాట్లే మన గుండెను బలహీనం చేస్తాయి. ఓ ఆరు ఆహారపు అలవాట్లను మానుకుంటే మన గుండెను పదిలంగా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది రుచిగా ఉంటాయని వేపుళ్లను ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఈ వేపుళ్లు గుండె ఆరోగ్యానికి హానికరం. వేపుళ్లలో సాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దాంతో గుండెకు ముప్పు వాటిళ్లుతుంది.
మద్యం అలవాటు గుండెకు చేటు చేస్తుంది. తరచూ మద్యం సేవించడంవల్ల గుండె సంబంధ అనారోగ్య సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మద్యం అలవాటును ఎంత తొందరగా మానుకుంటే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. ఉప్పులో సోడియం లెవల్స్ ఎక్కవగా ఉంటాయి. అందువల్ల ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. అది క్రమంగా గుండెపోటుకు దారితీస్తుంది.
స్వీట్లు, కేకులు, హల్వా లాంటి పదార్థాల్లో షుగర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. వీటిని తినడంవల్ల ఊబకాయం వస్తుంది. ఈ ఊబకాయం క్రమంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి స్వీట్లను చాలా మితంగా తీసుకోవాలి.
మేక, గొర్రె మాంసం లాంటి రెడ్ మీట్ కూడా గుండె ఆరోగ్యానికి కీడు చేస్తుంది. రెడ్ మీట్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడంవల్ల గుండె వ్యాధులు వస్తాయి. కాబట్టి తప్పకుండా రెడ్ మీట్ తీసుకోవడాన్ని తగ్గించాలి.
పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు చల్లని పానీయాలను ఇష్టపడుతారు. కానీ ఈ శీతలపానీయాల్లో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అది దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.