న్యూఢిల్లీ : గత మూడేండ్లలో భారత్లో గుండె పోటు మరణాలు (Heart Attack Deaths) గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ఈ ధోరణి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2022లోనే గుండెపోటు కేసులు 12.5 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది 28,413 మంది గుండె పోటుతో మరణిస్తే 2022లో ఆ సంఖ్య ఏకంగా 32,457కు ఎగబాకింది.
ఇక గుండెపోటుతో 2020లో 28,579 మరణాలు సంభవిస్తే 2021లో ఈ సంఖ్య 28,413గా నమోదైంది. గుండెపోటు మరణాలు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో ఇందుకు దారితీస్తున్న కారణాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. గుండె ఆరోగ్యంపై కరోనా ప్రభావాన్ని విస్మరించరాదనేది కూడా ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. గుండెకు మేలు చేసే జీవనశైలిని అనుసరించడం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read More :