మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు ఆహారం విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తారు. సరైన పౌష్టికాహారం అందక రకరకాల వ్యాధుల బారినపడుతుంటారు. తమ వయసుకు తగినట్టుగా పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని సమర్థంగా ఎదుర్కొని త్వరగా కోలుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు పౌష్టికాహార లోపం వల్ల మహిళల్లో వచ్చే వ్యాధులేంటి, వాటినుంచి ఎలా బయటపడాలో అవగాహన చేసుకుందాం.
సాధారణంగా మహిళల్లో రక్తహీనత, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్, అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం తదితర సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిలో చాలా వ్యాధులకు పౌష్టికాహారంతో చెక్ పెట్టొచ్చు. కొన్ని రకాల వ్యాధులను ముందస్తు టీకాల ద్వారా నివారించవచ్చు. మరికొన్ని రకాల వ్యాధులు… ముఖ్యంగా క్యాన్సర్ వంటి వాటిలో కొన్నిటిని ప్రారంభదశలో గుర్తించి సకాలంలో చికిత్స చేసి రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.
సాధారణంగా మహిళల్లో వచ్చే ప్రధానమైన సమస్య రక్తహీనత (ఎనీమియా). భారతదేశంలో దాదాపు 50శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రస్తుతం బాలికలు, యువతుల్లో సైతం రక్తహీనత సమస్య తలెత్తుతున్నది. ఇక గర్భిణుల్లో అయితే 70శాతం మందికి రక్తహీనత సమస్య కనిపిస్తుంది. మహిళలకు రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కానీ కొంతమందిలో 2-3 గ్రాముల హిమోగ్లోబిన్ మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. కాబట్టి, మహిళలు తమ ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎనీమియాపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రోజూ తగినపాళ్లలో పౌష్టికాహారం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తినాలి. పాలు, గుడ్లు, చేపలు, మాంసాహారంలో శరీరానికి అవసరమైనఐరన్ లభిస్తుంది.
శాకాహారుల్లో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తుంది. పౌష్టికాహారానికి ఎక్కువగా ఖర్చుపెట్టే స్తోమత లేనివారు చౌకగా లభించే బెల్లం పట్టీలు, పల్లిపట్టీలు, ఖర్జూరం లాంటి వాటిని తీసుకోవాలి. మాంసాహారులు కూడా వీటిని తీసుకోవడం మంచిది. ప్రభుత్వం ఉచితంగా ఐరన్ ట్యాబ్లెట్లను ఇస్తుంది. ముఖ్యంగా గర్భిణులు వైద్యుల సూచన మేరకు ఐరన్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి. కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్లు వాడితే పిల్లలు నలుపు రంగులో పుడతారనే అపోహతో వాటిని వాడటం మానేస్తున్నారు. అది నిజం కాదు. గర్భిణులు డాక్టర్‌ను కలిసిన ప్రతి సందర్భంలో హిమోగ్లోబిన్ స్థాయులను పరీక్షించుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ సూచన మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.
కొందరు మహిళలకు నెలసరిలో రక్తస్రావం అధికంగా జరుగుతుంది. దీనివల్ల కూడా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవడంతో సమస్య నుంచి బయటపడవచ్చు.
మహిళల్లో వచ్చే రెండో ప్రధాన వ్యాధి క్యాన్సర్. గడిచిన 10 సంవత్సరాలతో పోలిస్తే మహిళల్లో క్యాన్సర్ వ్యాధులు రెట్టింపు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి. మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా కొందరిలో కనిపిస్తాయి. సాధారణంగా రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చు. ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధిని నియంత్రించవచ్చు. సాధారణంగా మహిళల్లో కడుపునొప్పి, నెలసరి, వైట్ డిశ్చార్జ్వంటి సమస్యలు వచ్చినప్పుడు రొమ్ము పరీక్ష (బ్రెస్ట్ ఎగ్జామినేషన్) చేస్తారు. ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి.
భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. అందుకోసం ‘పాప్‌స్మియర్’ అనే చిన్నపాటి పరీక్ష ఉంటుంది. ఇది ఔట్ పేషెంట్ (ఓపీ)లోనే చేస్తారు. సాధారణంగా వివాహమైన ప్రతి మహిళ లేదా 20- 50 ఏండ్ల మధ్య వయసు మహిళలు ఈ పరీక్షను ప్రతి మూడేండ్లకు ఓసారి చేయించుకోవడం మంచిది. మామూలుగా క్యాన్సర్ వ్యాధి వచ్చే ముందు ప్రీ-క్యాన్సర్ స్టేజ్ (క్యాన్సర్ ముందు దశ) ఉంటుంది. ఈ దశలోనే గుర్తించగలిగితే వ్యాధి రాకుండా నియంత్రించవచ్చు. ఈ పాప్‌స్మియర్ టెస్ట్‌ను ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
సాధారణంగా మెనోపాజ్ వచ్చిన తర్వాత సదరు మహిళల్లో నెలసరి ఆగిపోతుంది. కాని, కొందరిలో 60 ఏండ్ల వయసులో మళ్లీ రక్తస్రావం ఏర్పడుతుంది. అలాంటి వారికి ‘హిస్ట్రోస్కోపి బయాప్సి’ చేస్తారు. ఇందులో గర్భసంచి వాల్వుల నుంచి బయాప్సీ తీసుకుని పరీక్ష జరుపుతారు. ఈ పరీక్ష ద్వారా గర్భాశయ (యూటరైన్) క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. ఇక్కడ కూడా ప్రీ- క్యాన్సర్ స్టేజ్‌ను గుర్తిస్తారు. ఈ దశలో సరైన చికిత్స అందిస్తే రోగిని కాపాడుకోవచ్చు.
అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్‌కు స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో లేదు. అందువల్ల దీన్ని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నాం. ఇది వ్యాధి తీవ్రమైన అడ్వాన్స్ స్టేజ్‌లోనే నిర్ధారణ అవుతుంది. కొంతమంది మహిళల్లో కడుపులో గడ్డలు (సిస్ట్స్) ఏర్పడతాయి. ఇలా వస్తే వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. ఈ పరీక్షతో వచ్చిన సిస్ట్ ఓవేరియన్ క్యాన్సర్‌కు సంబంధించిందా లేక, ప్రమాదకరం కాని బినైన్ కణితా అనేది తెలిసిపోతుంది. బినైన్ కణితి అయితే భయపడాల్సిన పనిలేదు. చికిత్సతో నయం చేయవచ్చు. ఓవేరియన్ క్యాన్సర్ కణితి అయితే మాత్రం తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది.
మహిళల్లో మరో చాలా సాధారణమైన రుగ్మత థైరాయిడ్. చాలామందిలో ఉండాల్సిన దానికంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనినే హైపో థైరాయిడిజం అంటారు. ప్రధానంగా యుక్తవయసు మహిళలు నెలసరిలో తీవ్ర రక్తస్రావం అవుతుందని వస్తుంటారు. వీరిలో చాలామందికి ఈ హైపో థైరాయిడిజం ఉంటుంది. తెలంగాణలో 25- 30 శాతం మహిళల్లో థైరాయిడ్ అసాధారణంగా ఉంటున్నది. ప్రతి సంవత్సరం థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇది చాలా చిన్న సమస్య. కాని అవగాహన లోపంతో కొంతమంది అనవసరంగా గర్భసంచి సర్జరీలు చేయించుకుంటారు. థైరాయిడ్ సప్లిమెంట్లతో సమస్యను నివారించవచ్చు. థైరాయిడ్ సమస్య తీరితే ఆటోమేటిక్‌గా రక్తస్రావం సమస్య తీరిపోతుంది. సాధారణంగా టీఎస్‌హెచ్ స్థాయులు 3- 5 మధ్య ఉండాలి. ఈ స్థాయులు 5 కంటే ఎక్కువగా ఉంటే థైరాయిడ్ స్థాయులు తక్కువగా ఉన్నట్టు.
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా మహిళలు కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. చాలామందిలో ఇప్పుడు అధిక రక్తపోటు (బీపీ, హైపర్ టెన్షన్), మధుమేహం సాధారణమైపోయాయి. కాబట్టి, బీపీ, షుగర్లను ఎప్పటికప్పుడు అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఈ మధ్యకాలంలో ఊబకాయ సమస్య కూడా మహిళల్లో అధికమవుతున్నది. దీనికి ప్రధాన కారణం తగినంత వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం, జంక్‌ఫుడ్, కొలెస్ట్రాల్‌తో కూడిన ఆహారం అధికంగా తీసుకోవడం వంటి కారణాల వల్ల ఊబకాయ సమస్య పెరుగుతున్నది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్, సాధారణ వ్యాయామం తప్పనిసరి చేయాలి. ఉద్యోగులైతే ఒకేచోట ఎక్కువసమయం కూర్చోకుండా కనీసం 15 నిమిషాలకు ఒక్కసారి అటూ ఇటూ తిరిగేందుకు యత్నించాలి. ముఖ్యంగా గర్భిణులు భోజనం చేసిన ప్రతిసారి కనీసం 5-10 నిమిషాలు కొంత వాకింగ్ చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
– మహేశ్వర్‌రావు బండారి
ప్రొఫెసర్ రాజేశ్వరి ఎండీ (ఓబీజీవై) మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్పిటల్