హలో మేడం. మొలకెత్తిన శనగలను శ్రావణ మాసంలో వాయనంగా ఇస్తారు. వర్షాకాలం, వేడుకలు నోములు ఎక్కువగా ఉండే ఈ సమయంలో వీటిని పంచడం, తినడం వెనుక ఏమైనా శాస్త్రీయత ఉందంటారా! ఈ సమయంలో ఇలా శనగలు తినడం ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది.
ఓ పాఠకురాలు
వానకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. ముఖ్యంగా మాంసాహారంతో ఈ సమస్య ఎక్కువ. బహుశా అందుకే ఈ పూజల కాలంలో దీన్ని దూరం పెట్టమని పెద్దలు చెప్పి ఉంటారు. చాతుర్మాస్య దీక్షల్లో భాగంగా ఒక నెల ఆకుకూరలు, ఒక నెల పాల పదార్థాలు… ఇలా కొన్నిటిని నిషేధించడంలోనూ ఇదే మూలంగా చెప్పొచ్చు. ఎందుకంటే వానకాలం ఆకుకూరలు కూడా బాగా కలుషితం అవుతాయి. నేలకు తక్కువ ఎత్తులో ఉండే వీటి ఆకులు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చే వాన నీళ్లలో మునుగుతుంటాయి. ఇది ప్రమాదం కలిగించే విషయం. ఇక, సాధారణంగా వానకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. మాంసం తినం కాబట్టి, ఆ స్థానంలో శరీరానికి శాకాహార ప్రొటీన్ అందించాలి. దానికి శనగలు చక్కని పరిష్కారం.
ఇందులో మాంసకృత్తులతో పాటు, పీచు ఎక్కువగా ఉంటుంది. ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియంలాంటి సూక్ష్మపోషకాలూ అందుతాయి. నానబెట్టడం వల్ల ఇందులోని ఫైటిక్ యాసిడ్ స్థాయులు తగ్గిపోతాయి. మాంసకృత్తుల్ని శరీరం శోషించుకోవడాన్ని ఈ యాసిడ్ తగ్గిస్తుంది. నానబెట్టి, ఉడికించి తింటే గ్యాస్ కూడా రాదు. ముఖ్యంగా శనగలు మొలకెత్తడం వల్ల అందులోని పోషక విలువలు అధికమవుతాయి. ఇక, శ్రావణ మాసంలో పూజలు, వేడుకలు అధికంగా ఉంటాయి. ఉపవాసాలు, వేళకు తినలేకపోవడాలు కూడా ఎక్కువే కాబట్టి.. శాకాహారులకు మరింత బలాన్ని చేకూర్చేందుకు శనగలను ఆహారంలో భాగం చేశారని చెప్పొచ్చు.
ఇక ఈ శనగల్ని ఎలా తిన్నా మేలే. కాస్త ఉడికించి కీర, క్యారెట్ ముక్కలు జతచేసి సలాడ్లాగా తినొచ్చు. లేదంటే పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అల్లం ముద్దతో తాలింపు వేసి… గుగ్గిళ్లు చేసుకోవచ్చు. ఈ సమయంలో అల్లం, జీలకర్ర, ఇంగువలాంటివి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే హంగ్కర్డ్లో… ఉడకబెట్టిన శనగలు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, జీలకర్ర పొడి, ఇంగువ, ఉప్పు, మిరియాల పొడి కలుపుకొని తిన్నా రుచిగా ఉంటుంది. ఇలా రోజుకు ఒక చిన్నకప్పు తినొచ్చు. శనగలు పొట్ట నిండిన భావనను కలిగించి, బరువు తగ్గేందుకూ సాయపడతాయి.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com