ద్రాక్ష పండ్ల సీజన్ నడుస్తున్నది. వీటిని ఎంతో ఇష్టంగా తింటాం. మన దగ్గర ఆకుపచ్చ, నల్ల రెండు రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. చూడటానికి ఒకేలా ఉన్నా రెండిటి రుచి వేరుగా ఉంటుంది. వీటి గుణగణాలను తెలుసుకుందాం.
వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ముఖ్యంగా రెస్వెరట్రాల్ అనే యాంటి ఆక్సిడెంట్‌కు ఇవి గనులు. ఇది యాంటి ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. నల్ల ద్రాక్షలో ఫైబర్, విటమిన్ సి, కె ఎక్కువగా ఉంటాయి. సహజ చక్కెర అయిన ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. వీటిలో పుష్కలంగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. డయాబెటిస్, అల్జీమర్స్, గుండెజబ్బులు, పార్కిన్సన్ తదితర వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. గుండె, మెదడుకు రక్షణగా ఒక పొరను రెస్వెరట్రాల్ ఏర్పరుస్తుంది. నల్ల, ఎర్ర ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరట్రాల్కు వయసు మీద పడటాన్ని తగ్గించే లక్షణాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
వీటిలో విటమిన్ సి, కె, పొటాషియం, ఫైబర్ పుష్కలం. యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిలోనూ యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే కార్బొహైడ్రేట్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. తొక్కలో ఉండే రెస్వెరట్రాల్ శరీర జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ఆకుపచ్చ ద్రాక్షలు బరువును ఆరోగ్యకరంగా ఉంచడంలో దోహదపడతాయి. అధిక రక్తపోటు నిర్వహణలోనూ సమర్థంగా పనిచేస్తాయని నిపుణుల మాట. ద్రాక్షలు నల్లవైనా, ఆకుపచ్చవైనా రెండూ విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలకు గనులే. ఆరోగ్య ప్రదాయినులే. మీ అవసరాలను బట్టి ఎంచుకోవచ్చు.