న్యూఢిల్లీ : వింటర్లో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలిని అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఘీ కాఫీ (ghee coffee) తీసుకోవడం మేలని కూడా న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. రోజువారీ కేఫిన్ను పరిమిత మోతాదులో తీసుకోవాలనే ఆరోగ్యాభిలాషులకు ఘీ కాఫీ మేలైన ఎంపికగా ముందుకొస్తోంది.
ఈ డ్రింక్‌తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని శాస్త్రీయ ఆధారాలు కూడా లభించాయి. రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి పలువురు సెలబ్రిటీలు ఘీ కాఫీకి తమ డైట్లో చోటు కల్పించారు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలగచేయడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మెరుగ్గా నిర్వహిస్తుంది. ఎక్కువసేపు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
కాఫీలో ఘీ కలపడం ద్వారా కేఫిన్ను శరీరం గ్రహించడం నెమ్మదించేలా చేస్తుంది. ఫ్యాట్స్‌తో కలిపి కేఫిన్ను తీసుకోవడం శక్తిని నిదానంగా విడుదల చేసేందుకు దారి తీస్తుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. కాఫీతో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా ఘీ కాఫీ ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. నెయ్యి వాడకంతో జీర్ణక్రియ మెరుగై కడుపుబ్బరం వంటి సమస్యలు నివారించవచ్చని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.
Read More :
Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?