Smart Phones | స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్తో పెరిగిన జనరేషన్-జెడ్ (జెజ్ జీ) (1997-2012 మధ్య జన్మించినవారు) జీవితంలో డిజిటల్ పరికరాలు విడదీయరాని భాగంగా మారాయి. అయితే నిరంతరం స్క్రీన్లకే పరిమితం కావడం వల్ల ఓర్పు తగ్గడం, ఆందోళన పెరగడం, ఏకాగ్రత దెబ్బతినడం, నిజమైన మానవ సంబంధాలు దూరమవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డిజిటల్ డిటాక్స్ అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యతను తిరిగి పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మొబైల్ ఫోన్ లేదా ఇతర డిజిటల్ పరికరాలకు దూరంగా ప్రకృతిలో నడవడం మంచి అలవాటుగా నిపుణులు చెబుతున్నారు. అలాగే తోటపని లేదా మొక్కల సంరక్షణలో సమయం గడపడం వల్ల ప్రకృతితో అనుబంధం పెరగడంతోపాటు ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
లోతైన శ్వాస వ్యాయామాలు, లయబద్ధమైన శ్వాస లేదా ప్రాణాయామం చేయడం కూడా డిజిటల్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి భావోద్వేగాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అలాగే కొంత సమయం ఒంటరిగా గడపడం వల్ల సోషల్ మీడియా ప్రభావానికి దూరంగా ఉండి స్వీయ అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. హమ్మింగ్ వ్యాయామం కూడా ప్రయోజనకరమైన అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస, ధ్వని, కంపనాలను కలిపి చేసే ఈ వ్యాయామం శరీరంలోని వాగస్ నాడిని ఉత్తేజపరచడంతోపాటు ఎండోర్ఫిన్ల విడుదలకు దోహదపడుతుంది. దీంతో ఒత్తిడి తగ్గి అంతర్గత ప్రశాంతత పెరుగుతుందని, అణచివేసిన భావోద్వేగాలను బయటకు తీసుకురావడంలో కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు.
వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లను పక్కన పెట్టి కలిసి భోజనం చేయడం లేదా సమయం గడపడం కూడా మంచి అలవాటు. ఇలాంటి సమావేశాలు భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచి, కుటుంబ బంధాలను బలపరుస్తాయి. అలాగే బహిరంగ క్రీడలు లేదా సృజనాత్మక గ్రూప్ కార్యకలాపాలు ఒంటరితనాన్ని తగ్గించి పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో లేదా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం కూడా డిజిటల్ డిటాక్స్‌లో భాగంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్క్రీన్లకు అతీతంగా జీవితానికి కొత్త అర్థం దొరుకుతుందని, ఇతరుల పట్ల సానుభూతి, ఓర్పు, మానవీయ విలువలు పెంపొందుతాయని నిపుణులు చెబుతున్నారు. కళలు, సంగీతం, నృత్యం, పుస్తకాలు చదవడం, డైరీ రాయడం, మండల ఆర్ట్ వంటి సృజనాత్మక అభిరుచులను పెంపొందించుకోవడం కూడా డిజిటల్ ప్రపంచం నుంచి కొంత విరామాన్ని అందిస్తుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచడంతోపాటు స్వీయ అనుబంధాన్ని పెంచి మానసిక సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.