Garlic | వంటల్లో ఉపయోగించే వివిధ పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. దీనిని ఎంతో కాలంగా మనం వంటల్లో వాడుతున్నాం. వెల్లుల్లిని వంటలల్లో వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే క్రియాశీలక పదార్థం ఉంటుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవలి అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. లిపిడ్ ప్రొఫైల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్, రక్తపోటు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి వాటిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుంది. గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఏవిధంగా సహాయపడుతుందో వైద్యులు వివరిస్తున్నారు.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె మొత్తం పనితీరును మెరుగుపరచడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో తీవ్రమైన గుండె సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె పనితీరు మెరుగుపడడంతో పాటు గుండె కండరాలు బలంగా తయారవుతాయి.
వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీంతో గుండె జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే రక్తం పలుచగా అవ్వడానికి మందులు వాడే వారు వెల్లుల్లిని వాడే విషయంలో జాగ్రత్త వహించాలి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల తలెత్తే ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు దీర్ఘకాలిక గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు.
గుండె కండరాలు బలహీనపడినప్పుడు లేదా ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె లైనింగ్ వాపులకు గురి అవుతుంది. ఇది జరగకుండా అడ్డుకోవడానికి గుండె లైనింగ్ స్థితిస్థాపకతను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెల్లుల్లి మనకు దోహదపడుతుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. ఇలా అనేక రకాలుగా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ చక్కని జీవన శైలిని పాటిస్తూ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.