Garlic | మన ఇంట్లోని వంటిల్లే ఓ వైద్యశాల వంటిదే. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయని తెలిసినా.. కానీ వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి సైతం ఒకటి. సాధారంగా వంటల్లో ఎక్కువగా రుచి కోసం వెల్లుల్లిని వాడుతుంటారు కానీ.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న గుండెజబ్బుల సమస్యను నియంత్రించడంలో సహాయపడే ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, హైబీపీ వంటి గుండెజబ్బులకు కారణమయ్యే సమస్యలను నియంత్రించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లితో కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదమే కాకుండా వైద్యశాస్త్రం సైతం చెబుతున్నది. వెల్లుల్లిలో అనేక సమ్మేళనాలు, పోషకాలున్నాయి. వీటితో శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజు ఉదయం మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వెల్లుల్లితో ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఓసారి తెలుసుకుందాం..
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే అనేక ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయని అధ్యయనాలు గుర్తించాయి. పలు అధ్యయనాల్లో రక్తపోటును తగ్గించడంలో వెల్లుల్లి ఓ ముఖ్యమైన ఔషధమని తేలింది. వెల్లుల్లి సారం 24 వారాల వ్యవధిలో రక్తపోటును తగ్గించడంలో మెడిసిన్స్ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుందని తేల్చారు.
ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండెజబ్బలకు ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. వెల్లుల్లిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుతం వెల్లుల్లి ఆరోగ్యకరమైన కొవ్వుపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే విషయంపై అధ్యయనాలు స్పష్టత ఇవ్వలేకపోయాయి.
వెల్లుల్లిని తీసుకుంటే రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. జలుబు, ఫ్లూ వంటి వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. దగ్గు, జ్వరం, జలుబును అరికడుతుంది. నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. చాలాకాలంగా ఉన్న నాసికా, గొంతు ఇన్ఫెక్షన్లను సైతం నివారిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మంచి ఫలితాలుంటాయి.