మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో చాలా తరచుగా మూత్రానికి వెళ్తున్నాడు. ఇదే విషయం స్కూల్ టీచర్లు చెప్పారు. హుషారుగా ఉంటాడు. బాగానే ఆడుకుంటాడు. తినడానికి పేచీ పెట్టడు. డాక్టర్కి చూపించాం. మూత్ర పరీక్ష చేయించాం. అంతా బాగానే ఉందన్నారు. ఎందుకు తరచుగా మూత్రానికి వెళ్తున్నాడు? ఇంకేమన్నా పరీక్షలు చేయించాలా? ఇదేమైనా ప్రమాదకరమైన సమస్యా?
మీ పిల్లవాడు తరచుగా మూత్రానికి వెళ్తున్నాడని చెబుతున్నారు. ఏ సమయంలో ఇలా వెళ్తున్నాడు. ఉదయమా? రాత్రి పూటా? అనేది చెప్పలేదు. పక్క తడిపే అలవాటు గురించీ ప్రస్తావించలేదు.
ఈ సమస్య ఎన్ని రోజులుగా ఉన్నదో కూడా తెలియపరచలేదు. యూరిన్లో మంట ఉన్నదా? మూత్రం కొంచెం కొంచెం పోస్తున్నాడా? పూర్తిగానే పోస్తున్నాడా? ఈ వివరాలన్నీ తెలిస్తే సమస్య ఏమిటన్నది నిర్ణయించవచ్చు. ఇది కొద్ది రోజుల నుంచే అవుతూ ఉండి, మూత్రంలో కొంచెం మంట, నొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వొచ్చు. మూత్రానికి తరచుగా వెళ్లినంత మాత్రాన డయాబెటిస్ ఉందని అనుకోవడానికి లేదు. యూరిన్ టెస్ట్ చేయించామన్నారు.
అది ఏ మూత్ర పరీక్షో వివరంగా చెప్పలేదు. సింపుల్ యూరిన్ టెస్ట్ అయితే దాంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్ సమస్య ఉంటే తెలుస్తుంది. మూత్ర పరీక్షలో యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే.. తర్వాత యూరిన్ కల్చర్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. యూరిన్ టెస్ట్తోపాటు రక్త పరీక్ష, స్కాన్ అవసరం ఉంటుంది. మరోసారి డాక్టర్ని కలిసి అన్ని వివరాలు చెప్పి, పరీక్షలు చేయించండి. పిల్లవాడు యాక్టివ్గానే ఉన్నాడని అంటున్నారు. కాబట్టి తరచుగా మూత్రానికి పోవడం సీరియస్ సమస్య కాకపోవచ్చు.
కొంతమంది పిల్లలు తరచుగా మంచినీళ్లు తాగుతారు. కొందరికి నీళ్లు తాగడం వ్యసనంలా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు ఆందోళన చెందినట్లయితే యాంగ్జయిటీతో కూడా తరచూ మూత్రానికి వెళ్తుంటారు. చలికాలంలో చెమట పోయదు కాబట్టి ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఈ లక్షణాలన్నీ చూసుకుని డాక్టర్ని కలవండి. పరీక్షలు నిర్ణయిస్తే సమస్య ఏమిటో తేలుతుంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్