మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమించడం చాలా అవసరం. అందుకోసమే చాలామంది జిమ్‌లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లకు కండరాల దృఢత్వాన్ని పెంచే సప్లిమెంట్స్ అవసరం. అయితే అవి సహజసిద్ధమైనవై ఉండాలి. రోజువారీ ఆహారం ద్వారా లభించాలి. సంతులిత ఆహారం, తగినంత విశ్రాంతి, నియమబద్ధమైన వ్యాయామం వల్ల కండరాలు శక్తిమంతం అవుతాయి.
క్రియాటిన్: కండరాలను బలంగా ఉంచడంలో క్రియాటిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కోడి మాంసం, సాల్మన్, ట్యూనా, కాడ్ లాంటి చేపల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్ లాంటివి చేసేవారికి క్రియాటిన్ చాలా అవసరం. కండరాలు ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునేందుకు ఇది పయోగపడుతుంది.
బీటెయిన్: ఇది బీట్రూట్, పాలకూర, కినోవా, మొరంగడ్డ, వీట్ బ్రాన్ మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటుంది. ఈ బీటెయిన్ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో ఇది మజిల్ ఎండ్యూరెన్స్, హైడ్రేషన్‌కు తోడ్పడుతుంది.
కార్నిటైన్: మైటోకాండ్రియా కణాలకు ఫ్యాటీ ఆమ్లాలను రవాణా చేసేదే కార్నిటైన్. ఇది ఎక్కువగా మాంసం (రెడ్‌మీట్), పౌల్ట్రీ, పాల పదార్థాలు, అవకాడో, ఆస్పాగరస్ తదితర ఆహార పదార్థాల్లో ఉంటుంది. వ్యాయామం చేసే వాళ్లు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
అమైనో ఆమ్లాలు: బ్రాంచ్డ్ చెయిన్ అమైనో యాసిడ్స్ (బీసీఏఏ)లో ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్ వంటి అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పాల పదార్థాలు, సోయాబీన్స్, లెంటిల్స్, గింజలు, విత్తనాలు, గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం సమయంలో కండరాలు ఈ అమైనో ఆమ్లాలను నేరుగా ఖర్చు చేస్తాయి. దానివల్ల మజిల్ బ్రేక్ డౌన్ జరగదు. ఈ బీసీఏఏలు అధిక వ్యాయామం సమయంలో ఏర్పడే కండరాల బలహీనతను తగ్గిస్తుంది. అలాగే కండరాలు దెబ్బతిన్నప్పుడు, ఇవి త్వరగా నయం చేస్తాయి.