పోషకాహారంలో డ్రై ఫ్రూట్స్ భాగమని అందరికీ తెలుసు. ఇవి మనిషికి ఆరోగ్య సమస్యలు రాకుండా చేసి జీవితకాలాన్ని పెంచుతాయి. ఇదే విషయాన్ని ఇటీవల న్యూజెర్సీలోని హ్యాకెన్సాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనలో అధిక కొవ్వు, ఊబకాయం ఉన్నవాళ్లను కూడా చేర్చి అధ్యయనం చేశారు. రోజూ 60 గ్రాములు లేదా 22 బాదం గింజలు తినడం వల్ల, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు.
అలాగే బాదంలోని విటమిన్-ఇ, పాలీఫెనాల్స్ లాంటివి సెల్యులర్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయని విశ్లేషించారు. బాదం తినడం వల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్జీమర్స్, క్యాన్సర్, న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్ లాంటివి దరిచేరవని ఈ పరిశోధన తేల్చింది. తద్వారా మనిషి ఎక్కువకాలం ఆనందకరమైన జీవితం గడపొచ్చని పేర్కొన్నారు.