Dry Fruits For Cholesterol Reducing | మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని ఇంకా చాలా మందికి తెలియదు. ఒకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఇంకొకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్డీఎల్ అంటారు. అయితే మనం పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం, మన అలవాట్లు వంటి అనేక అంశాల కారణంగా మన శరీరంలో ఎప్పటికప్పుడు ఎల్డీఎల్ పెరిగిపోతుంది. కానీ మన శరీరంలో ఉండే హెచ్‌డీఎల్ దాన్ని తగ్గిస్తుంది. ఇందుకు గాను హెచ్‌డీఎల్ ఉండే ఆహారాలను మనం తినాల్సి ఉంటుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను తినాలన్నమాట. ఇక మంచి కొలెస్ట్రాల్ మనకు పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో సమృద్ధిగా లభిస్తుంది. వీటిని మన డైట్లో భాగం చేసుకుంటే మనకు హెచ్‌డీఎల్ లభిస్తుంది. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక హెచ్‌డీఎల్ ఉన్న ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పులో హెచ్‌డీఎల్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల బాదం పప్పు ద్వారా మనకు 33 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్. మన శరీరంలో చేరిన తరువాత ఇవి హెచ్డీఎల్గా మారుతాయి. దీంతో ఎల్డీఎల్ శాతం తగ్గుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. కనుక బాదంపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే బీపీ తగ్గడమే కాదు, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే డ్రై అంజీర్ పండ్లలోనూ అధిక మొత్తంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అందువల్ల అంజీర్ పండ్లను తింటే మన శరీరంలో హెచ్‌డీఎల్ పెరుగుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
ఎండిన కొబ్బరి కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 గ్రాముల ఎండిన కొబ్బరి ద్వారా సుమారుగా 65 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. కనుక కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎల్డీఎల్ మోతాదును తగ్గిస్తాయి. హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది. అలాగే కొబ్బరి బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అదేవిధంగా పల్లీలను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా హెచ్‌డీఎల్‌ను పెంచుకోవచ్చు. 100 గ్రాముల పల్లీల ద్వారా మనకు సుమారుగా 49 గ్రాముల మేర మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. ఇవి మన శరీరంలోని ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. గుండెను సురక్షితంగా ఉంచుతాయి. కనుక పల్లీలను కూడా రోజూ తినవచ్చు.
మన ఆరోగ్యానికి పైన్ నట్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి మనకు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. ఈ నట్స్‌ను 100 గ్రాముల మేర తింటే సుమారుగా 68 గ్రాముల మేర మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. దీంతోపాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లను కూడా పొందవచ్చు. ఇవన్నీ మన శరీరంలో ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా హేజల్‌నట్స్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇవి కూడా మనకు సూపర్ మార్కెట్లలో విరివిగా లభిస్తాయి. 100 గ్రాముల హేజల్ నట్స్ ద్వారా సుమారుగా 61 గ్రాముల మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. ఇలా పలు రకాల నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఎల్‌డీఎల్‌ను తగ్గించుకుని హెచ్‌డీఎల్‌ను పెంచుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.