Cancer Cells | చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణమవుతుందా? క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా ఉండేందుకు చక్కెరను పూర్తిగా మానేస్తే ట్యూమర్లు తగ్గుతాయా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ అంశంపై ఉన్న అపోహలను నిపుణులు నివృత్తి చేస్తున్నారు. చక్కెర నేరుగా మెదడు క్యాన్సర్‌కు కారణం కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్యూమర్‌ను ఆకలితో చంపాలంటే చక్కెరను పూర్తిగా మానేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాలు కొన్నిసార్లు ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శరీరంలోని ప్రతి కణం, ఆరోగ్యకరమైన కణమైనా, క్యాన్సర్ కణమైనా గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగిస్తుంది. మెదడు ట్యూమర్ కణాలు గ్లూకోజ్‌ను ఎక్కువగా వినియోగించినప్పటికీ, చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల ట్యూమర్ మాత్రమే కాదు, శరీరంలోని సాధారణ కణాలు కూడా శక్తి కోల్పోతాయి. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని శరీరం సహజంగానే నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చక్కెరను పూర్తిగా మానేస్తే ట్యూమర్ ఆకలితో చనిపోతుందనుకోవడం సరైంది కాదు. అయితే రోజూ అధికంగా చక్కెర ఉన్న ఆహారాలు, శీతల పానీయాలు, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తరచూ పెరుగుతాయి. ఇన్సులిన్‌తో పాటు ఐజీఎఫ్-1 (IGF-1) అనే గ్రోత్ హార్మోన్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ స్థాయిలు ఎక్కువ కాలం పెరిగి ఉండటం వల్ల ఇప్పటికే శరీరంలో ఉన్న ట్యూమర్ కణాలు పెరగడానికి, చికిత్సను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే చక్కెర నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోయినా, అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు ట్యూమర్‌కు అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి.
అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) కూడా పెరుగుతుంది. దీని ప్రభావంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు బలహీనపడి క్యాన్సర్ కణాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. కార్బొహైడ్రేట్లు కూడా రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. అందుకే కొందరు కీటో డైట్ పాటిస్తే మెదడు ట్యూమర్ పెరుగుదలను అడ్డుకోవచ్చని భావిస్తుంటారు. అయితే దీనిపై కూడా జాగ్రత్త అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని మెదడు ట్యూమర్ కణాలు కీటోన్స్‌ను కూడా శక్తి వనరుగా వినియోగించుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతేకాకుండా కీటో డైట్ వల్ల గణనీయంగా బరువు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారిలో ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల కీటో డైట్‌ను వైద్యుల పర్యవేక్షణ లేకుండా ప్రారంభించకూడదు. చక్కెరను పూర్తిగా మానేయడం కంటే రోజువారీ జీవితంలో దానిని క్రమంగా తగ్గించడం ఉత్తమ మార్గం. తీపి పానీయాలను తగ్గించడం, టీ లేదా కాఫీలో చక్కెర పరిమాణాన్ని తగ్గించడం, అధికంగా ప్రాసెస్ చేసిన తీపి పదార్థాలకు బదులుగా సమతుల ఆహారం తీసుకోవడం వంటి చిన్న మార్పులు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఏదైనా ప్రత్యేక ఆహార విధానాన్ని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.