మా అన్నయ్యకు పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తను వారం క్రితం బాగా నీరసించి, జ్వరంతో బాధపడ్డాడు. మూత్రం పచ్చగా వచ్చింది. డాక్టర్‌కి చూపిస్తే కామెర్లు (హెపటైటిస్) అని చెప్పారు. మందులు రాసిచ్చారు. ‘కామెర్లకు ప్రత్యేకంగా మందులు లేవు. ఇవి వాడండి. జ్వరం, నీరసం తగ్గుతుంది’ అని చెప్పారు. మావాళ్లు ఆకు పసరు పోయించాలని ప్రయత్నాలు చేస్తుంటే.. అది సరైంది కాదని నేను వారించాను. ఆకు పసరు వాడవచ్చా? దీనికి వైజ్ఞానిక రుజువులు ఉన్నాయా?
Hepatitis | సాధారణంగా వచ్చే కామెర్లను హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అంటాం. ఇవి వైరస్ వల్ల వస్తాయి. వీటి బారినపడితే సాధారణంగా కాలేయం ఎక్కువగా ప్రభావితమవుతుంది. జ్వరం వస్తుంది. నీరసం ఉంటుంది. కొద్ది రోజులకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, ఈలోపు ఏవైనా అనారోగ్య సమస్య వస్తే దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ వైరస్‌కు ప్రత్యేకమైన మందులు లేవు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైరస్ ఇన్ఫెక్షనా, లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అనేది నిర్ధారించాలి.
హెపటైటిస్ సాధారణంగానే కొన్ని రోజులకు తగ్గుతుంది. ఈలోగా ఆకు పసరు, చెట్టు మందు తీసుకుంటారు. ఎలాగూ తగ్గే జబ్బే అయినా ఆ పసరు వల్లే తగ్గిందని నమ్ముతారు. కొన్నిసార్లు వైరస్ వల్ల వచ్చిన జబ్బు కంటే పసరు, చెట్టు మందు వల్ల వచ్చే సమస్యలే ప్రమాదకరంగా ఉంటాయి. కామెర్ల రోగిలో వైరస్ వల్ల కాలేయం బాగా దెబ్బతింటుంది. ఆ చెట్టు మందుల్లో లోహ మూలకాలు ఉంటే అవి లివర్‌ను ఇంకా నష్టపరుస్తాయి. మంచి సలహా ఇచ్చి ఆ నష్టం జరగకుండా చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
జాండిస్ వస్తే కొన్ని ఆహార నియమాలు తప్పక పాటించాలి. ఆహారంలోని కొవ్వుని జీర్ణం చేయడానికి కాలేయం సహాయపడుతుంది. కామెర్ల వ్యాధి వల్ల కాలేయం పనితీరు తగ్గుతుంది. కాబట్టి నూనె, కొవ్వులు ఉన్న ఆహారం తినకుండా ఉండాలి. తేలికగా అరిగే ఆహారమే తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారం తీసుకోవాలి. జ్వరం ఉంటే పారిసిటమాల్ మాత్రలు డాక్టర్ సూచించినట్టుగా వేసుకోవాలి. వ్యాధి పూర్తిగా తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలి. ఆకు పసరు, చెట్టు మందు కామెర్లు తగ్గిస్తాయనడానికి వైజ్ఞానికంగా ఎలాంటి ఆధారాలు లేవు. దీనివల్ల దుష్పరిణామాలే ఎక్కువ. అమాయకంగా ఆకు పసరును నమ్ముకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారినపడే ప్రమాదం ఉంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్