జన్యుపరమైన లోపాలు.. జీవనశైలిలో మార్పులు.. ఆహారంలో అధిక క్యాలరీలు.. కానరాని వ్యాయామాలు.. అన్నీ కలిసి కొందరు అమ్మాయిలను బాల్యం నుంచే బొద్దుగా తయారు చేస్తున్నాయి. చిన్నతనంలోనే పలకరిస్తున్న థైరాయిడ్, హార్మోన్ సమస్యలు.. ఊబకాయం బారినపడేస్తున్నాయి. ఫలితంగా.. అమ్మాయిలు అనారోగ్యానికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా.. గర్భధారణ సమయంలో మరింత ఇబ్బంది పడుతున్నారు. వీరేకాదు.. వీరికి పుట్టబోయే పిల్లలు కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఊబకాయంతో బాధపడే మహిళలకు పుట్టే పిల్లల్లో.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. ఆటిజం, ఏడీహెచ్డీ వంటి నాడీ సంబంధ వ్యాధులబారిన ఎక్కువగా పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందుకు కారణాలు తెలుసుకొని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొందరు అమ్మాయిలు చిన్నతనం నుంచే బరువు పెరిగిపోతుంటారు. చిన్నతనంలోనే రజస్వల కావడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటివి వారిని ఊబకాయం బారినపడేస్తుంటాయి.
ఇలాంటివారిలో ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయంలో తీవ్ర ఇబ్బందులను కలగజేస్తుంటాయి. ముందుస్తు డెలివరీ, కాన్పు పోవడం, జెస్టేషనల్ డయాబెటిస్, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక వీరిలో నార్మల్ డెలివరీ చాలా కష్టం. సిజేరియన్కే మొగ్గు చూపాల్సి ఉంటుంది. అందుకే, బాల్యంలోనే బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తే.. ముందునుంచే జాగ్రత్తలు పాటించాలి. బరువుపై కాకుండా బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)పై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం చేసేవారు కూడా ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చొని ఉండొద్దని అంటున్నారు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కుర్చీల్లోంచి లేచి.. ఓ ఐదారు నిమిషాలు నడవాలని సూచిస్తున్నారు. ఇక మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను దూరం పెట్టాలనీ, కాఫీ, టీలనూ తగ్గించుకోవాలని అంటున్నారు. సంపూర్ణ పోషకాహారం తీసుకోవడంతోపాటు కంటి నిండా నిద్రపోవాలని చెబుతున్నారు. ఇలా.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ, నిత్యం వ్యాయాయం చేస్తూ, జీవనశైలిలో మార్పులు చేసుకొని.. గర్భధారణకు ముందే బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే అనేక సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు.