నిరుత్సాహపరిచే శీతగాలుల్లో ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని ఎంపిక చేసిన ఆహారాలను తప్పక తీసుకోవాలి. చలికాలంలో ఉండే బద్దకాన్ని వదిలించుకునేందుకు, చల్లటి వాతావరణంలో కలిగే జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు మీ డైట్లో ఈ మెనూ ఉండేలా చూసుకోండి.
కొవ్వు అధికంగా ఉండే చేపలను వారానికి ఒకసారి తప్పకుండా తినండి. వీటిలో ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు చురుకుదనాన్ని ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్మీటర్స్ పనితీరుని మెరుగుపరుస్తాయి. కాబట్టి బద్దకంగా, నిరుత్సాహంగా ఉండేవాళ్లు కనీసం వారానికి మూడు సార్లు చేపల కూర తింటే మంచిది.
ఆకుకూరల్లో ఉండే విటమిన్ బీ-9 (ఫోలేట్) మెదడులో సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ని ప్రభావితం చేస్తుంది. పాలకూర, కాలే (లీఫ్ క్యాబేజ్)లతోపాటు మిగతా ఆకుకూరలు కూడా తినొచ్చు. ఆకుకూరల్లో యాంటి ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల ఆకు కూరలూ తీసుకునే ప్రయత్నం చేయాలి. అస్తమా, జలుబు, దగ్గు, గొంతునొప్పి తరచుగా బాధిస్తుంటే ప్రతి రోజూ ఏదో ఒక పూట ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.
జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడం వల్ల సాధారణ అలర్జీలు దరిచేరవు. అంతేకాదు శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు వ్యాధినిరోధ శక్తిని పెంపొందించుకోవాలి. ఇందుకోసం జీర్ణవ్యవస్థలో మేలుచేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మజ్జిగ, పెరుగు, యోగర్ట్ తీసుకుంటే మంచిది.
పండ్లు తింటే ఆరోగ్య మెరుగవుతుందనే అవగాహన అందరికీ ఉంది. అలాగే శీతాకాలంలో పుల్లని పండ్లు తింటే అలర్జీ (జలుబు, తుమ్ములు) వస్తుందనే అపోహ కూడా ఉంది. ఆ అలర్జీలను తగ్గించే, వ్యాధినిరోధకతను పెంచడంలో పుల్లని పండ్లకు మరేవీ సాటిరావు. పుల్లని ఫలరసాల్లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. బత్తాయి, నారింజ ఫల రసాలను తరచుగా తాగుతూ ఉంటే శీతాకాలంలో బలుబు సమస్య రాదు.
ఎక్కడికి పోయినా మన మూలాలు మరచిపోవద్దని చెబుతారు. ఆరోగ్య విషయంలోనూ అంతే. దుంప(వేర్లు)ల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పిండి పదార్థాలతోపాటు ఫైబర్ కూడా వీటిలో ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డలు, చామగడ్డలు వంటి దుంపకూరల్ని తప్పక తినాలి.
శీతాకాలంలో వేడివేడి టీలు ఎక్కువగా తాగుతారు. పాలతో చేసిన టీ, కాఫీల కంటే హెర్బల్ టీలు తాగితే ఎక్కువ మేలు జరుగుతుంది. లెమన్ టీ, చామంతితో చేసిన టీ తాగితే ఆందోళన వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. హెర్బల్ టీ తాగితే నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. గురక సమస్య కూడా తగ్గుతుంది.