గురువారం 03 డిసెంబర్ 2020
Health - Nov 19, 2020 , 21:23:58

మీరు నిద్రపోయే పద్ధతి చర్మాన్ని కూడా దెబ్బతీస్తుందని మీకు తెలుసా?

మీరు నిద్రపోయే పద్ధతి చర్మాన్ని కూడా దెబ్బతీస్తుందని మీకు తెలుసా?

హైదరాబాద్ : మనం నిద్రపోయే భంగిమ సరిగ్గా లేకపోతే.. మెడ నొప్పి, వెన్నుముక నొప్పి, ఛాతి నొప్పి లాంటివి వస్తాయని తెలిసిందే. అయితే.. మన స్లీపింగ్ పొజిషన్ మన చర్మాన్ని దెబ్బతీస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. అస్సలు ఇలా ఆలోచించి ఉండరు కదా. ఇప్పుడు ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే.. మన చర్మంపై ముడతలు, వాపు, మొటిమలు లాంటి సమస్యలు రావటానికి ఓ రకంగా మన నిద్రాభంగిమ సైతం కారణమవుతుందట. ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పని ప్రభావం చర్మంపై పడుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకునేందు చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. 

చర్మంపై ముడతులు, మొటిమలు తదితర సమస్యల నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటాం. ముఖ్యంగా మంచి నిద్ర వల్ల మంచి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు అన్న డాక్టర్ల సలహాను వీలైనంత వరకూ పాటిస్తున్నాం. అయితే రాత్రులు మనం ప్రశాంతంగా 8 గంటల పాటు నిద్రపోవడమే కాదు నిద్రపోయే భంగిమ కూడా చర్మ సౌందర్యానికి ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

బోర్లా పడుకోవడం చేయొద్దు..

బోర్లా పడుకున్నప్పుడు ముఖాన్ని పూర్తిగా దిండుపైనే పెడుతుంటాం. ఇలా పడుకోవడం చర్మానికి అస్సలు మంచిది కాదట. పొట్టవైపుకి తిరిగి పడుకున్నప్పుడు ముఖంపై ఉండే చర్మానికి పూర్తిగా ఊపిరాడదు.  అంతేకాదు ముఖానికి రాసుకునే స్కిన్ ప్రొడక్ట్స్‌ను దిండు పీల్చుకుని దాంట్లోని మురికితో కలిపేస్తుంది. మరుసటి రోజు అదే దిండుపై ముఖం పెట్టి పడుకున్నప్పుడు మురికి, బ్యాక్టీరియా అంతా ముఖంపై చేరుతుంది. ఫలితంగా మొటిమలు, వాపు లాంటి చర్మసమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపుకు తిరిగి పడుకోవద్దు..

ఒకవైపుకు తిరిగి పడుకోవడం కూడా దాదాపు బోర్లా పడుకోవడం లాంటిదే. ఇలా చేయడం వల్ల ముఖానికి ఒకవైపు చర్మం మొత్తం దిండుతో మూసుకుపోతుంది. ముఖానికి రాసుకున్న లోషన్ దానికి అంటి.. మరుసటి రోజు దిండులోని బ్యాక్టీరియా ముఖానికే అంటుకుంటుంది. ఫలితంగా చర్మంపై ముడతలు, మొటిమలు, బుగ్గలు లోపలికి పోవడం లాంటివి సంభవిస్తాయి. 

వెల్లకిలా పడుకుంటే మంచిది..

వెల్లకిలా పడుకోవడం అన్ని రకాలుగా మంచి పొజిషన్‌గా చెప్పొచ్చు. తలను 20-30 డిగ్రీల్లో ఉంచి పడుకోవడం వల్ల ఎలాంటి ద్రవపదార్థం గడ్డకట్టకుండా ఉంటుంది. అంతేకాదు ముఖానికి రాసుకున్న లోషన్ దిండుకు అంటదు. దిండుకున్న బ్యాక్టీరియా మీ ముఖానికి అంటదు. మీరు రాసుకున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్ రాత్రంతా ముఖంలోకి ఇంకిపోతుంది. ఫలితంగా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.