Diabetes | ఎంత సంపద, మరెంత పెద్ద బలగం ఉన్నా మనిషికి ఒక్క కంటిచూపు లేకపోతే జీవితం చీకటిమయమే. మన శరీరంలో ప్రతి అవయవమూ ముఖ్యమైందే. దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అన్నీ ఉన్నా కంటిచూపు లేక పోతే మాత్రం అంతా శూన్యంలానే ఉంటుంది. అందుకే ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. అయితే, అవగాహన లోపమో, లేదా నిర్లక్ష్యం వల్లో కానీ ఈ మధ్యకాలంలో మధుమేహం కారణంగా చాలా మంది కంటిచూపును కోల్పోతుండటం బాధాకరం. ఈ నేపథ్యంలో మధుమేహానికి కంటిచూపునకు సంబంధం ఏంటి? మధుమేహం చూపుపై ఏమేరకు ప్రభావం చూపుతుంది? షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి చూపు కోల్పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి తెలుసుకుందాం.
డయాబెటిస్ (మధుమేహం) వచ్చిన 10 సంవత్సరాలలో కచ్చితంగా కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే జువెనైల్ డయాబెటిస్ అంటే పుట్టుకతోనే షుగర్ ఉన్నవారికి కంటిచూపు సమస్యలతోపాటు మానసిక, శారీరక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా కిడ్నీ వంటి అవయవాలు సైతం ప్రభావితమవుతాయి. సాధారణంగా మధుమేహం వల్ల కంటి రక్తనాళాల లోపలి భాగంలో ఉండే ‘ఎండోథీలియం’ దెబ్బతింటుంది. దీంతో కంటికి రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా కంటిచూపు మందగిస్తుంది. ఇంకా కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి.
పుట్టుకతోనే మధుమేహం బారినపడిన జువెనైల్ డయాబెటిక్స్ రోగుల్లో మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వారిలో శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు. మెదడు ఎదుగుదల కూడా ఉండదు. పైగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో లేకపోతే శరీరంలో అన్ని ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి, జువెనైల్ డయాబెటిక్స్ చిన్నప్పటి నుంచే షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి.
తల్లిదండ్రుల్లో డయాబెటిస్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి పిల్లలకు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్లు పిల్లలపట్ల మరింత జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి డయాబెటిస్ ఉంటే 50శాతం, ఇద్దరికీ ఉంటే 75శాతం వరకు పిల్లల్లో కూడా మధుమేహం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
నలభై ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇక దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లయితే ఆరునెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. డయాబెటిస్ రోగుల్లో ప్రాథమికంగా కంటి రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా గ్లకోమా కారణంగా కంటి నరాలపై ఒత్తిడి పెరిగి చూపు దెబ్బతినే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇంకా, మధుమేహ రోగుల్లో క్యాటరాక్ట్ (కంట్లో శుక్లాలు) అభివృద్ధి చెందే అవకాశమూ ఎక్కువే.
డయాబెటిస్ ప్రభావంతో కంట్లో కీలక భాగమైన రెటీనా దెబ్బతింటుంది. అయితే ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండవు. రెండో దశలో కంట్లో కొన్ని రక్తనాళాలు లీక్ అవుతాయి. దీంతో కంట్లో ఏదో కదిలినట్టు ‘ఫ్లోటరస్’గా అనిపిస్తుంది. ఫలితంగా రెటీనాలోని ‘మాక్యులా’ వాపునకు గురై చూపు దెబ్బతింటుంది. దీన్నే మాక్యులార్ ఎడిమా అంటారు. చివరికి రెటీనా డిటాచ్మెంట్… అంటే రెటీనా కంటిపొర నుంచి వేరుపడి చూపు పూర్తిగా పోతుంది.
రెటీనా డిటాచ్మెంట్ అయినప్పుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కంటిచూపు ఎంతమేరకు తిరిగి వస్తుందో కచ్చితంగా చెప్పలేం. అందువల్ల ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.
కంటి లోపల ఒత్తిడి 17- 21 మిల్లీ మీటర్స్ ఆఫ్ మెర్క్యురీ ఉండాలి. అంటే కంటి టెన్షన్ ఆ మోతాదులో ఉండాలి. ఈ పరిమితికి మించి ఉంటే దాన్ని గ్లకోమా అంటారు.
గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు యాంటి గ్లకోమా చికిత్స అందుబాటులో ఉంది.
మామూలు వారితో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 40 ఏండ్ల వయసులోనే క్యాటరాక్ట్ (కంట్లో శుక్లాలు) రావడం సాధారణం. సకాలంలో సంబంధిత వైద్యులను కలిసి పరీక్షలు, సర్జరీ చేయించుకోవాలి. మధుమేహం ఉన్న 90శాతం మందిలో గ్లకోమా సమస్య ఏర్పడుతుంది. అందువల్ల డయాబెటిస్ రోగులు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.