ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఉండే అధిక చక్కెర మన కళ్లకు ఎంత నష్టం చేకూరుస్తుందో ఆలోచించారా? ఆహారం ద్వారా శరీరంలోకి చేరే చక్కెర.. మధుమేహానికి మాత్రమే కాకుండా కంటి జబ్బులకు, దంతాల ఇన్ఫెక్షన్కు కూడా కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో లేకపోతే దీర్ఘకాలంలో కంటి చూపుపై తీవ్ర ప్రభావమే పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం ప్రధానంగా రెటీనాలోని చిన్న రక్తనాళాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది.
డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, కంటి శుక్లాల వంటి సమస్యలు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకుండా వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం. అసలు అలాంటి సమస్యల నుంచి మన కళ్లను కాపాడుకోవడం కోసం కేవలం మందులను మాత్రమే ఎంచుకుంటే సరిపోదు తినే ఆహారంలో కూడా జాగ్రత్త వహించాలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సమతుల ఆహారం: ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలు వంటివి ఎక్కువ తీసుకోవాలి. అవి చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. తద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. స్వీట్లు, ప్రాసెస్ చేసిన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో తియ్యని పానీయాలు, చిరుతిండ్లకు దూరం ఉంటే మరీ మంచిది. ప్యాక్ చేసిన పండ్ల రసానికి బదులు తాజా పండ్లు తీసుకోవడం వల్ల కూడా చక్కెర నియంత్రించినవాళ్లమవుతాం.
జీవన శైలిలో మార్పు: మధుమేహాన్ని అదుపు చేయడంలో తినే తిండితో పాటు నడక, వ్యాయామం అత్యంత ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంటుంది. వ్యాయామం రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ధూమపానానికి దూరంగా ఉండాల్సిందే. స్క్రీన్ సమయాన్ని తగ్గించి కళ్లకు అవసరమైనంత విశ్రాంతినివ్వాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.