నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్నది ఓ తాజా అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. క్యారెట్లలో ఉండే ఓ రెండు పదార్థాలు పొట్టలో ఉండే బ్యాక్టీరియాను పెంపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని వాళ్లు కనుగొన్నారు.
క్యారెట్లు రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరించడంలో దోహదపడతాయని వెల్లడించారు. జంతువులు, ఎలుకల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో క్యారెట్లు తిన్నవాటి పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగిందని తేలింది. మనుషుల మీద ఇంకా అధ్యయనం నిర్వహించాల్సి ఉంది. ముందుముందు మధుమేహానికి క్యారెట్లు ఖర్చులేని చికిత్సగా పనికిరావచ్చని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.