Heart health @ Exercise | ప్రతి నిత్యం వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రన్నింగ్, వాకింగ్, జంపింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్.. ఇలా ఏ వ్యాయామాన్ని చేసినా మన శరీరాన్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుకోగలుగుతాం. ఇటీవలి అధ్యయనాల ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఒక వ్యక్తి ఏ సమయంలో వ్యాయామం చేయాలి..? ఈ ప్రమాదాల నుంచి బయటపడేయడంలో వీటి పాత్ర ఎలాంటిది? అనే అంశాలను వెల్లడించారు.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. వ్యాయామాలు ఏ సమయంలోనైనా చేయవచ్చు. అయితే, ఉదయం ముఖ్యంగా 8-11 గంటల మధ్య చేసే శారీరక శ్రమ రోజులో ఏ ఇతర సమయంలో చేసే శ్రమతో పోల్చితే హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించారు. బ్రిటన్ బయోబ్యాంక్లోని 86,657 మంది డాటాను అధ్యయనకారులు విశ్లేషించారు. వీరి సగటు వయస్సు 62. వారం రోజుల వ్యవధిలో వ్యాయామాల్లో పాల్గొన్నవారి శారీరక శ్రమను రికార్డ్ చేయడానికి యాక్సిలెరోమీటర్లను ఉపయోగించారు. ఉదయం 11 గంటల కన్నా ముందు వ్యాయామం చేసేవారిలో గుండె సంబంధ సమస్యలు, స్ట్రోక్ రాకుండా ఉంటుందని గుర్తించారు.
ఉదయం వేళ చేసే వ్యాయామాల ద్వారా షుగర్, ఫ్యాట్లకు సంబంధించిన జీవక్రియలు సజవుగా జరుగుతాయి. వీటివల్ల అధిక బరువు, టైప్-2 డయాబెటీస్ తగ్గుముఖం పడతాయి. కండర కణాల సామర్థ్యాన్ని పెంచుతాయని అధ్యయనకారులు తేల్చారు. అలాగే కొన్ని రకాల ధీర్ఘకాలిక జబ్బులు కూడా నయమవుతాయని గుర్తించారు. అయితే, సాయంత్రం వేళ చేసే వ్యాయామాల వల్ల క్యాలరీలను బాగా ఖర్చు చేసే సత్తా పెరుగుతుందని ఇటీవలి మరో అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చడం విశేషం.