ఆదిభట్ల : రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని రాజేశ్వర్రెడ్డి పౌల్ట్రీ ఫామ్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ నగదు పందెం కాస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఆదిభట్ల ఏసీపీ అనుమతితో ఎస్ఐ ఇద్దరు మధ్యవర్తులు, పోలీసు సిబ్బందితో కలిసి స్థావరానికి చేరుకున్నారు.
పోలీసులను గమనించిన కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన 22 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుల నుంచి 31 కోళ్లు, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.