Sree Vishnu | సినిమా విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేయడం కోసం హీరోలు, హీరోయిన్లు, దర్శకులు చేసే ఆసక్తికర వ్యాఖ్యలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా తమ సినిమా హిట్ కాకపోతే తాము ఫలానా పని చేస్తామంటూ సవాళ్లు విసరడం కూడా ఇటీవల పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగా మారుతోంది. అయితే ఇలాంటి స్టేట్మెంట్లపై యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా ఆసక్తికరంగా స్పందించారు. తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీవిష్ణు.. సినిమా విజయంపై నమ్మకం ఉంటే ఇలాంటి సంచలన వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదంటూ దర్శకుడికి సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
సినిమా పబ్లిసిటీ కోసం కొందరు సెలబ్రిటీలు చేస్తున్న ప్రకటనలపై శ్రీవిష్ణు పరోక్షంగా సెటైర్ వేశారు. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా విడుదలకు ముందు నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలు విప్పి అండర్‌వేర్‌తో తిరుగుతానని దర్శకుడు సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. అదే విధంగా ‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తే అమీర్‌పేట్‌లో గుండు గీసుకుంటానంటూ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన స్టేట్మెంట్ కూడా అప్పట్లో వైరల్ అయింది. ఈ తరహా వ్యాఖ్యలు సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడానికి ఉపయోగపడుతున్నప్పటికీ.. సినిమా కంటెంట్ కంటే సంచలన వ్యాఖ్యలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
‘కామ్రేడ్ కళ్యాణ్’ దర్శకుడిని ఉద్దేశిస్తూ శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సినిమా మీద నమ్మకం ఉంటే ఇలాంటి వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.“కంగారు పడకు.. కంగారు పడి వాగ్దానాలు చేయకు. సినిమా హిట్ అవ్వకపోతే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలు విప్పి తిరుగుతాను.. అటువంటివి అన్నీ వద్దు” అంటూ ఆయన చమత్కారంగా అన్నారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పిన శ్రీవిష్ణు.. ఒక సినిమా విజయం సాధించడానికి ఇలాంటి సంచలన స్టేట్మెంట్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సినిమా కోసం టీమ్ నిజాయతీగా కష్టపడితే.. కథలో బలం, సినిమాలో విలువ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారని శ్రీవిష్ణు అన్నారు.మనం కష్టపడి నిజాయతీగా కథ అందించినప్పుడు, నిజంగా దాంట్లో బలం ఉన్నప్పుడు, విలువ ఉన్నప్పుడు ప్రేక్షకులు మనకు విజయాన్ని అందిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.