చలికాలంలో ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చలితీవ్రత పెరిగితే.. శ్వాసలో ఇబ్బంది, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో ఆస్తమా బాధితులు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరిస్తున్నారు.
ఆస్తమాతో బాధపడేవాళ్లు.. తెల్లవారుజామునే మేల్కోవడం మంచిదికాదు. అలవాటు ప్రకారం నిద్రలేచినా.. ఆరుబయటికి మాత్రం రావొద్దు. సాయంత్రంపూట బయట ఎక్కువసేపు ఉండకూడదు. చల్లని గాలుల నుంచి రక్షణ కోసం తల, చెవులను కప్పి ఉంచుకోవాలి. అలాగే, చల్లని, పుల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. స్వీట్స్ కూడా కొందరిలో అలర్జీని కలగజేస్తాయి. ప్రాసెస్ చేసిన, ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఈ సమయంలో కూల్ డ్రింక్స్ విషంతో సమానమేనని గుర్తుంచుకోవాలి. తాగేనీరు కూడా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
మరికొందరు చలినుంచి ఉపశమనం పొందడానికి కాఫీలు, టీలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. కానీ, వీటిలో అధిక స్థాయిలో ఉండే కెఫిన్.. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. ఇక చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ లాంటివి సాధారణంగానే వ్యాపిస్తుంటాయి. ఇవి ఆస్తమా బాధితులను మరింత ఇబ్బంది పెడతాయి. కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడంతోపాటు జలుబు, ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండాలి. పొగ, దుమ్ము, ధూళి లాంటి కాలుష్యాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. శ్వాసకోశ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కొన్నిరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజులను ప్రయత్నించొచ్చు.