Women | ప్రసవం తర్వాత మహిళ శరీరం పూర్తిగా కోలుకోవడానికి, అలాగే శిశువుకు తల్లిపాలు అందించడానికి సరైన పోషకాహారం అత్యంత కీలకం. గర్భధారణ సమయంలో పోషకాహారంపై ఎంత శ్రద్ధ అవసరమో, ప్రసవానంతరం కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శరీర పునరుద్ధరణ వేగవంతమవడంతోపాటు శక్తి పెరుగుతుంది, తల్లిపాల ఉత్పత్తికి కూడా మేలు జరుగుతుంది. ప్రసవం తర్వాత శరీరం తీవ్రమైన శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సాధారణ ప్రసవమైనా, సిజేరియన్ అయినా శరీరానికి కోలుకునే సమయం అవసరం. ఈ సమయంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాల పునరుద్ధరణ, గాయాలు త్వరగా మానడం, శరీర కణజాలం మరమ్మత్తు కావడంలో సహాయపడుతుంది. గుడ్లు, పనీర్, పప్పులు, టోఫూ, చికెన్ వంటి ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవడం మంచిది.
ప్రసవ సమయంలో రక్తనష్టం జరగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే శరీరంలోని ఐరన్ నిల్వలను పునరుద్ధరించేందుకు పాలకూర, బీట్రూట్, బెల్లం, ఖర్జూరం, లీన్ మీట్ వంటి ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీంతో రక్తహీనత ప్రమాదం కూడా తగ్గుతుంది. మంచి కొవ్వులు (హెల్తీ ఫ్యాట్స్) కూడా ప్రసవానంతర పోషకాహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్, గింజలు, విత్తనాలు వంటి ఆహారాల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా హార్మోన్ల సమతుల్యతకు కూడా తోడ్పడతాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి పెరుగు, పాలు, నువ్వులు, రాగి వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ప్రసవం తర్వాత, ముఖ్యంగా తల్లిపాలు ఇస్తున్న మహిళలకు తగినంత నీరు తాగడం చాలా అవసరం. శరీరంలో ప్రతి కణం సక్రమంగా పనిచేయడానికి, జీర్ణక్రియ మెరుగుపడడానికి, తల్లిపాల ఉత్పత్తి సక్రమంగా సాగడానికి హైడ్రేషన్ కీలకం. రోజుకు సుమారు 2.5 నుంచి 3 లీటర్ల వరకు ద్రవాలు తీసుకోవాలి. సాధారణ నీటితోపాటు కొబ్బరి నీరు, మజ్జిగ, చికెన్ సూప్, పప్పు సూప్ వంటి పోషక విలువలు కలిగిన ద్రవాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
ప్రసవానంతరం రోజుకు మూడు పెద్ద భోజనాల కంటే తక్కువ మోతాదులో తరచూ ఆహారం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి నిరంతరం శక్తి అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోవడాన్ని నివారించవచ్చు. దీంతో ప్రసవానంతర అలసట కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రాసెస్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అధిక కాఫీ, మద్యం వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించాలి. వీటి బదులుగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఫైబర్ తక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ ఆహారాల్లో అజ్వైన్ (వాము), మెంతులు, జీలకర్ర, గోండ్ వంటి పదార్థాలు కూడా ప్రసవానంతర కాలంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. గోండ్ లడ్డూలు, వాము నీరు, మెంతులతో చేసిన వంటకాలు ప్రసవం తర్వాత కోలుకునే ప్రక్రియకు తోడ్పడతాయి.