Diabetes | మన బంధుమిత్రుల్లో చాలామంది.. ప్రీడయాబెటిస్, డయాబెటిస్తో బాధపడటం గమనిస్తూ ఉంటాం. అనారోగ్యకరమైన ఆహారం, జీవన శైలిలో నాణ్యత లోపించడం వల్ల తలెత్తే వ్యాధి ఇది. రక్తంలో చక్కెరను నియంత్రించడమే లక్ష్యంగా.. ఆహారంలో మార్పులు చేసుకుంటే మధుమేహం పెద్దగా బాధించదు.
డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చాలామంది కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవడం మీద దృష్టిపెడతారు. అంతేకానీ, స్థూల పోషకాల గురించి ఏమాత్రం ఆలోచించరు. కార్బొహైడ్రేట్లు తగ్గించుకున్నా, దానికి తగినట్టు ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇన్సులిన్, థైరాక్సిన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తికి కొవ్వులు చాలా అవసరం. కాబట్టి సరైన కొవ్వు పదార్థాలు తీసుకుంటేనే.. అవి చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. అదే సమయంలో రిఫైన్డ్ నూనెలు, జంక్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన చిరుతిళ్ల లాంటి చెడు కొవ్వులను దూరం పెట్టాలి. వాటికి బదులుగా గింజలు, మొలకలు, గానుగ నూనెలు లాంటి మంచి కొవ్వులను భోజనంలో భాగం చేసుకోవాలి.
అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్ల శరీరం.. ప్రత్యేకించి క్లోమగ్రంథి ఎక్కువగా అలసిపోతుంది. ఫలితంగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇన్సులిన్ సంబంధ సమస్యలకు అంటుకడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే.. ఆహార పరిమాణం మీద నియంత్రణ తప్పదు.
తిండి పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి. దీనివల్ల చక్కెర స్థాయులు తొందరగా పెరగవు. అరగని ఆహారాన్ని పొట్టలోకి నెట్టేస్తే.. దానిని పక్వం చేయడానికి జీర్ణాశయం మరిన్ని ఎంజైములు, ఆమ్లాలు, ఇన్సులిన్ లాంటివాటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
చురుకుదనం లోపించిన జీవనశైలి చిన్న వయసులోనే డయాబెటిస్‌కు దారితీస్తుంది. అదే వ్యాయామం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. మన శరీరంలోని కోట్లాది కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందేలా చేస్తుంది. ఉదయం నడక మొదలుకుని రోజూ కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలి. ధనురాసనం, భుజంగాసనం లాంటి యోగ భంగిమలు డయాబెటిస్ నివారణలో ఉపయోగకరంగా ఉంటాయి.
పండ్లు అదే పనిగా తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. రోజూ ఒక గిన్నె పొప్పడిపండు ముక్కలు కానీ, ఓ మోస్తరు యాపిల్ కానీ తీసుకోవాలి. వాటిని బాదం లాంటివాటితో కలిపి తింటే శరీరంలో ఫ్రక్టోజ్ విడుదలనూ నియంత్రిస్తాయి. అదే ఎక్కువ పండ్లు ఒకేసారి తీసుకుంటే శరీరం ఫ్రక్టోజ్‌ను శోషింపజేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది పొట్టకు సమస్యగా మారుతుంది. అంతిమంగా మధుమేహానికి దారితీస్తుంది.