Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పలువురు ఎమ్మెల్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. కమల్ నాథ్ తాను పార్టీ మారుతున్నాననే ప్రచారానికి తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని, బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఆయన ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి వివరించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాగా, కమల్ నాథ్ తనకు రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టనందుకు పార్టీ నాయకత్వంపై కినుక వహించారని, ఆయన బీజేపీలో చేరతారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కుమారుడు నకుల్ నాథ్‌తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కాషాయ పార్టీలో చేరతారని వార్తలు ఊపందుకున్నాయి.
ఇక కాంగ్రెస్‌ను వీడబోనని, బీజేపీలో తాను చేరడం లేదని కమల్ నాథ్ స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ బీజేపీలో చేరుతారనే ప్రచారంపై ఎంపీ కార్యాలయం ఆదివారం స్పందించింది. ఈ వార్తలు నిరాధారమని తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఎంపీ బీజేపీతో టచ్‌లో ఉన్నారని, కమలం గుర్తుపై ఆయన పంజాబ్‌లోని లుథియానా నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకోవడంతో ఎంపీ కార్యాలయం ఈ వివరణ ఇచ్చింది.
Read More :